అంతటా వారే! వారే! అయితే అనర్థమే!

ఎనుముల కుటుంబీకుల లాబీయింగ్‌పై జోరుగా చర్చ.. సీఎం రేవంత్ రెడ్డికి ఇరకాటం

సొంత పార్టీ నుంచే విమర్శలు.. పదవులకు దూరం.. అనధికారిక జోక్యం

ఆంధ్రప్రభ న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌చార్జి, హైదరాబాద్: జడ్పీటీసీ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత కుటుంబమే రాజకీయంగా ఇబ్బందికర అంశంగా మారుతుందన్న ఆందోళన రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా వినిపిస్తోంది. అధికారికంగా కుటుంబ సభ్యులను రాజకీయ పదవులకు దూరంగా ఉంచిన ముఖ్యమంత్రి, అనధికారికంగా వారి జోక్యానికి మాత్రం కళ్లెం వేయలేకపోతున్నారన్న ప్రచారం జరగడం ఇందుకు కారణంగా వారు పేర్కొంటున్నారు. రాజకీయ లబ్ధికోసం విపక్షాలు చేసే విమర్శలను పక్కన పెడితే, స్వపక్షంలోనే ఈ అంశంపై చర్చ జోరుగా సాగుతుండటం కాంగ్రెస్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ నేతల మధ్య ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతోంది.


సచివాలయ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యంపై చర్చ

మరోవైపు సచివాలయ వర్గాల్లోనూ ఇదే అంశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులకు రేవంత్ రెడ్డి కుటుంబీకులు నేరుగా ఫోన్లు చేయడం, పనుల విషయంలో మాట్లాడటం, కొన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు బ్యూరోక్రాట్ వర్గాలతో పాటు, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్ ప్రభుత్వంపై కుటుంబ జోక్యం, పాలనపై విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల నుంచే ఈ అంశంపై విమర్శలు వినిపిస్తుండటం అసలు సమస్యగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సోదరులు, కుటుంబ సభ్యులు నియోజకవర్గాలు, అధికార వ్యవహారాల్లో కనిపిస్తున్నారంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో అంతా వాళ్లేనా.. అన్న చర్చ కిందిస్థాయి క్యాడర్‌లోనూ మొదలైనట్లు తెలుస్తోంది. కుటుంబ జోక్యంపై గత పరిణామాల ప్రస్తావన

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన సోదరుడు నియోజకవర్గంలో హడావుడి చేసిన విషయాన్ని అప్పట్లో రాజకీయంగా విమర్శించిన సందర్భాలను కొందరు నేతలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. కుటుంబం నుంచి ఒకరిద్దరు రాజకీయంగా చురుగ్గా కనిపించడం సహజమేనని, కానీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగి, అధికార వ్యవస్థపై ప్రభావం చూపుతున్న భావన ఏర్పడితే అది ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కుటుంబ పాలన విమర్శలే ఇప్పుడు ఆయుధం

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన ప్రధాన విమర్శల్లో కుటుంబ పాలన కూడా ఒకటి.ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలోని పలువురు కీలక స్థానాల్లో ఉండటాన్ని కాంగ్రెస్ పదేపదే ప్రశ్నించింది.అదే అంశాన్ని ఆధారం చేసుకునే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేసింది.ముఖ్యంగా తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగించిన ఉద్యమం ఫలవంతమై, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేసిందని, అయితే తెలంగాణ ప్రజల కల సాకారమైనా, నియామకాలు మాత్రం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని విమర్శలు సాగించిన నేతల్లో రేవంత్ రెడ్డి ఒకరు.అయితే ప్రస్తుతం రేవంత్ కుటుంబ సభ్యులపై అదే తరహా ఆరోపణలు రావడం రాజకీయంగా కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


పదవులకు దూరంగా ఉంచిన రేవంత్

ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కుటుంబ సభ్యులను అధికారిక పదవులకు ఉంచడంలో రేవంత్ రెడ్డి తన మార్క్ ప్రత్యేకత చూపించారు.కుటుంబ సభ్యులను రాజకీయ పదవుల్లోకి తీసుకురాకుండా దూరంగా ఉంచటం ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు, ఇతర రాజకీయ పార్టీలకు ఆయన తన విభిన్నతను చాటేలా ముఖ్య సందేశాన్ని ఇచ్చారు. అయితే పదవులను ఇవ్వకపోయినప్పటికీ, అనధికారికంగా సీఎం సోదరులు ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండటంతో, రేవంత్ రెడ్డి పదవుల విషయంలో తీసుకున్న నిర్ణయానికే విలువ తగ్గుతుందని సాక్షాత్తూ కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు.


బ్యూరోక్రాట్లలోనూ అసంతృప్తి?

కొన్ని అంశాలపై అధికారులు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఈ అంశంపై ఎక్కువగా అంతర్గత చర్చలే జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధికార వ్యవస్థలో ఇలాంటి భావన ఏర్పడటం కూడా ప్రభుత్వ ప్రతిష్ఠకు మంచిది కాదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.


పైరవీలకు దూరంగా ఉండాలన్న సీఎం వైఖరి

ఇటీవల గాంధీభవన్‌కు వచ్చి పదవుల కోసం లాబీయింగ్ చేసే నేతలపై రేవంత్ రెడ్డి స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా ఉండకుండా పదవుల కోసం తిరిగే వారికి అవకాశాలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. అదే తరహాలో కుటుంబ సభ్యుల విషయంలోనూ స్పష్టమైన నియంత్రణ అవసరం అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాధారణమైనది కాదు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు ఆయన. కాంగ్రెస్ వంటి జాతీయ రాజకీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నాయకత్వ స్థాయికి వచ్చారు.

నాయకుడి భవిష్యత్తుపై కుటుంబ వ్యవహారశైలి ప్రభావం

అలాంటి నాయకుడి రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యుల వ్యవహారశైలి మచ్చగా మిగిలిపోకూడదంటే ఇప్పుడే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఫోన్లు, సిఫారసులు, పనుల విషయంలో జోక్యం వంటి అంశాలపై పార్టీ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.


కుటుంబాన్ని నియంత్రించాల్సిందేనా?

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అధికార వ్యవహారాల్లో అనధికారికంగా జోక్యం చేసుకుంటున్నారనే భావన ప్రజల్లోనూ, పార్టీలోనూ బలపడితే, అది క్రమంగా ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం మారుతుందని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్‌పై ప్రయోగించిన కుటుంబ పాలన విమర్శనాస్త్రం తిరిగి కాంగ్రెస్ వైపే మళ్లే ప్రమాదం పొంచి ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే కుటుంబ సభ్యుల రాజకీయ, పరిపాలనా జోక్యంపై రేవంత్ రెడ్డి స్పష్టమైన గీత గీయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.


ఇప్పుడే కళ్లెం వేస్తే..

కుటుంబ సభ్యులను అధికారిక పదవులకు దూరంగా ఉంచిన రేవంత్.. అనధికారిక జోక్యానికీ అదేస్థాయిలో దూరం పాటించేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తే విమర్శకుల నోళ్లకు తాళం పడే అవకాశం ఉంది. లేకపోతే కుటుంబ పాలన అనే రాజకీయ విమర్శ క్రమంగా ప్రభుత్వ పనితీరు, పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశంగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న రేవంత్ కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలు రాజకీయంగా ఇబ్బందికరంగా మారకుండా ఇప్పుడే నియంత్రించడం అవసరమని వారు పేర్కొంటున్నారు. కుటుంబాన్ని అధికారానికి దూరంగా ఉంచడమే కాకుండా, అధికార ప్రభావానికి కూడా దూరంగా ఉంచగలిగితేనే రేవంత్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


– ఆంధ్రప్రభ న్యూస్ నెట్‌వర్క్