AP | కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

AP | కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • 10నిమిషాల్లో దేవుడు… కానీ ముందే విధి తీర్పు
  • భక్తి యాత్ర… రక్త యాత్రగా మారిన విషాదం
  • సన్నిధి చేరక ముందే… ఎనిమిది ప్రాణాల అంత్యం
  • దేవుడి దగ్గరికి వెళ్తూ… మరణం దగ్గరైంది!
  • 8 మంది మృతి

AP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : స్వామి సన్నిధి ముందే..మృత్యువు ఎదురు చూసింది! దైవ దర్శనం కోసం బయలుదేరిన ఆ బంధువుల బృందానికి అది ఆనంద యాత్ర కావాలి… కానీ ఆ ప్రయాణం కన్నీటి గాధగా మారింది. “ఇంకా కొద్ది నిమిషాల్లో స్వామి దర్శనం” అన్న ఆశలు… క్షణాల్లోనే రోడ్డుపైనే చిద్రమయ్యాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన ఆ 22 మంది బంధువులు, ఎంతో భక్తి భావంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం కోసం బయలుదేరారు.

వాహనంలో భజనలు, నవ్వులు, స్వామి నామస్మరణలతో ప్రయాణం సాగింది. “స్వామి దర్శనం అయ్యాక కలిసి అన్నదానం చేద్దాం” అంటూ మాటలు కలిసిపోయాయి. కానీ.. విధి వేరే తీర్పు చెప్పింది. మంత్రాలయం చేరుకోవడానికి కేవలం 10 నిమిషాల దూరంలో ఉండగానే, చిలకలడోణ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్యాంకర్ తో ఢీకొన్న క్షణం… అన్నీ ముగిసిపోయాయి. ఒకే దెబ్బతో ఎనిమిది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాహనం లోపల ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది… కొద్దిసేపటి క్రితం నవ్వులు పూయించిన ముఖాలు… రక్తపు మడుగులో పడి కనిపించాయి.

“అన్నా… లేవయ్యా… స్వామి దగ్గరికి వచ్చేశాం…” అంటూ గాయపడినవారి ఆర్తనాదాలు వినిపించాయి. కానీ స్పందించాల్సిన వారు ఇక లేరు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులే కావడంతో, ఆ గ్రామాల్లో వేదన వర్ణించలేనిది. ఇంటి ముందర వేచిచూస్తున్న వారి కళ్లలో ఆశలు ఒక్కసారిగా కరిగిపోయాయి. “దేవుడి దర్శనానికి వెళ్తున్న వాళ్లకు ఇదేనా ఫలితం?” అంటూ కన్నీటి ప్రశ్నలు మిగిలాయి. దైవ దర్శనం కోసం బయలుదేరిన ఆ యాత్ర… విషాదయాత్రగా మారింది. స్వామి సన్నిధికి చేరకముందే, ఎనిమిది ప్రాణాలు మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాయి. భక్తి, ఆనందం, ఆశలతో ప్రారంభమైన ఆ ప్రయాణం… కుటుంబాల గుండెల్లో ఎప్పటికీ మాయని గాయంగా మిగిలిపోయింది.

Leave a Reply