ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. వద్దన్నా వచ్చేస్తున్నాడు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుండపోత వానలు (rains) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. గ్రామాల రోడ్లు ఛిద్రం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నరకం చూస్తున్న ప్రజలు వానలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. కానీ వరుణుడు వదిలేలా లేడు. తెలంగాణ, ఏపీలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorology Department) వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. వీటి ప్రభావంతో మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా (Narayanpet District)లలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బుధవారం సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

