Andhra-Prabha-Effect : కదిలింది,, ఆపీసర్ల రథం
Andhra-Prabha-Effect : కదిలింది,, ఆపీసర్ల రథం
- దొంగ హాజరుపై విచారణ
- ఐదుగురు సభ్యులతో కమిటీ రెడీ
- రికార్డుల్లో హాజరు. విధుల్లో గైర్హాజరు
- ఆంధ్రప్రభ కథనంతో కదిలిన డొంక
- న్యూ జిజిహెచ్‌లో హాజరు మాయ
- ఆరు నెలలుగా జీతాలు గుటుక్కు.
- పది మంది ముఠాపై అనుమానాలు
- గత ఏడాది డిజిటల్ హాజరు
- బిల్లులపై లోతుగా విచారణ
- సూత్రధారులపై ఆరా ..

( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ)
పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు రికార్డులే అనుమానాలకు తావిస్తున్నాయి. విధులకు హాజరుకాని సిబ్బందికి సైతం హాజరు వేసి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్న ఘటన విజయవాడ న్యూ జిజిహెచ్‌లో బయటపడింది. ఆసుపత్రి రికార్డుల్లో వంద మందికిపైగా ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవంగా వార్డుల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం, విధులకు డుమ్మా కొట్టిన వారికి సైతం హాజరు నమోదు చేస్తున్న అంశాలను ఆంధ్రప్రభ ఇదోరకం దోపిడీ కథనంతో వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో వైద్యారోగ్య శాఖ స్పందించి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. డీఎంఈ విష్ణువర్ధన్ ఆదేశాలతో జాయింట్ డైరెక్టర్ అప్పారావు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాది కాలంగా నమోదైన డిజిటల్ హాజరు, హాజరు పట్టికలు, బిల్లులు, జీతాల చెల్లింపుల వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
Andhra-Prabha-Effect : విచారణలో బహిర్గతం…

ఆడిట్‌కు పంపిన హాజరు వివరాలను పరిశీలించినప్పుడు ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలు ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా నిరంతరం విధులకు హాజరైనట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నట్లు సమాచారం. అయితే అదే సమయంలో వార్డుల్లో సిబ్బంది కొరత కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రికార్డుల్లో నమోదైన హాజరు.. వాస్తవంగా సిబ్బంది విధులకు హాజరైన దానికి సరిపోతుందా? అనే అంశాన్ని విచారణ కమిటీ ప్రధానంగా పరిశీలిస్తోంది. ప్రాథమిక విచారణలో పది మందికిపైగా సిబ్బంది గత ఆరు నెలలుగా విధులకు హాజరుకాకపోయినా పూర్తి జీతాలు పొందినట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఈ సంఖ్యను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. రికార్డుల పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో మరికొందరి వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విధులకు రాకపోయినా హాజరు ఎలా నమోదైంది? ఎవరు హాజరు వేశారు? ఆ హాజరు ఆధారంగా బిల్లులు ఎవరు రూపొందించారు? వాటిని ఎవరు పరిశీలించి ఆమోదించారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత మొత్తం చెల్లించబడింది? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
Andhra-Prabha-Effect : హాజరు బిల్లుల చెల్లింపు..

శానిటైజింగ్ ఇన్‌స్పెక్టర్ సోమరాజు సమర్పించిన హాజరు నివేదిక ఆధారంగా బిల్లుల ప్రక్రియ జరిగినట్లు సమాచారం. సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతి బిల్లులు చేసినట్లు, ఆమె సెలవులో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంఓ బిల్లులు చేసినట్లు కూడా విచారణలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేవలం హాజరు నమోదుకే పరిమితం కాకుండా.. హాజరు నుంచి బిల్లు, బిల్లు నుంచి జీతం చెల్లింపు వరకు మొత్తం ప్రక్రియలో ఎవరి పాత్ర ఎంత? అన్న కోణంలో అధికారులు రికార్డులను క్రాస్‌చెక్ చేస్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘకాలంగా విధులకు హాజరుకాని కొందరు ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలు వ్యవహారం వెలుగులోకి రావడంతో మెడికల్ సర్టిఫికెట్లు పట్టుకుని తిరిగి విధుల్లో చేరేందుకు ఆసుపత్రికి వస్తున్నట్లు సమాచారం. అయితే గైర్హాజరు కాలంలో వారు ఎక్కడ ఉన్నారు? ఎందుకు విధులకు రాలేదు? అయినప్పటికీ హాజరు ఎలా నమోదైంది? అన్న అంశాలు కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో శానిటైజింగ్ ఇన్‌స్పెక్టర్ సోమరాజు పాత్రపైనా విచారణ జరుగుతోంది. శానిటైజింగ్ మహిళా కార్మికులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆయనను ఓల్డ్ జిజిహెచ్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఫేక్ అటెండెన్స్ వ్యవహారంలో ఆయన సమర్పించిన హాజరు నివేదికలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు జాయింట్ డైరెక్టర్ అప్పారావు నేతృత్వంలోని విచారణ కమిటీలో న్యూరాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ అరుణకుమారి, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఎస్‌ఎంసీ ఈడీ అన్నపూర్ణ, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతి సభ్యులుగా ఉన్నారు. అయితే గతంలో ఫేక్ అటెండెన్స్ బిల్లులకు ఆమోదం తెలిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతినే విచారణ కమిటీలో సభ్యురాలిగా చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో ఆమె పాత్రపైనా పరిశీలన జరగాల్సి ఉన్న నేపథ్యంలో కమిటీ కూర్పుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Andhra-Prabha-Effect : విశిత పరిశీలన…
గత ఏడాది కాలంగా అప్‌లోడ్ చేసిన హాజరు పట్టికలు, డిజిటల్ అటెండెన్స్ రికార్డులు, బిల్లులు, జీతాల చెల్లింపుల వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. విధులకు రాని వారికి హాజరు ఎవరు నమోదు చేశారు? ఆ హాజరును ఎవరు ధ్రువీకరించారు? బిల్లులు ఎవరు రూపొందించారు? ఎవరు ఆమోదించారు? ఈ వ్యవహారం ఎంతకాలంగా కొనసాగుతోంది? ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే దిశగా విచారణ సాగుతోంది. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా పారదర్శకంగా విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీఎంఈ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ పూర్తయితే న్యూ జిజిహెచ్‌లో వెలుగుచూసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘దొంగ హాజరు’ వ్యవహారంలో అసలు బాధ్యులు ఎవరు, ప్రజాధనానికి జరిగిన నష్టం ఎంత అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.
