న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఇందులో కర్ణాటక హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు ఉన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆమోదించింది. ఏప్రిల్ 15 నుంచి 19 వరకు జరిగిన కొలీజియం సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ కర్ణాటక హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ కోరగా కొలీజియం ఆమోదం తెలిపింది.
మరో న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ నటరాజన్ కేరళ హైకోర్టుకు కోరగా ఓకే చెప్పింది. జస్టిస్ నెరనహళ్లి శ్రీనివాస్ సంజయ్ గౌడను గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద్‌ను ఒడిశా హైకోర్టుకు బదిలీ చేసింది. వీరితో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీ సుధను కర్ణాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.