AICC | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

AICC | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
- 5 మంది ఎమ్మెల్యేలకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు
- కార్పోరేషన్ చైర్మన్లకు కూడా బాధ్యతలు అప్పగింత
- ‘మెజారిటీ డీసీసీ అధ్యక్షులుగా ఎస్సీ, ఎస్టీ , బీసీలకు బాధ్యతలు
హైదరాబాద్,ఆంధ్రప్రభ : ఎట్టకేలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ ) అధ్యక్షులను ఎఐసీసీ ప్రకటించింది. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత నిస్తూ 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. మెజారిటీ డీసీసీల అధ్యక్షులుగా ఎస్సీ, ఎస్టీ,బీసీలకు బాధ్యతలు అప్పగించింది. బీసీ వర్గాలకు 42 శాతం డీసీసీలను కేటాయించింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించింది.
5 మంది ఎమ్మెల్యేలకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించగా, పలు కార్పోరేషన్ చైర్మన్లకు కూడా డీసీసీ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంఘటన్ శ్రీజన్ అభియాన్‌లో భాగంగా ఎఐసీసీ పరిశీలకులు జిల్లాలు పర్యటించి ఇచ్చిన నివేదికల ఆధారంగా కమిటీలను ప్రకటించినట్లు ఎఐసీసీ స్పష్టం చేసింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్‌కర్నూలు డీసీసీ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ (ఎస్సీ ) ను నియమించింది. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ( బీసీ ), కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (ఎస్సీ ) , పెద్ద పల్లి జిల్లా అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ (బీసీ ), నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (ఎస్టీ ) ని నియమించారు.




శాట్ చైర్మన్ శివసేనారెడ్డిని వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ దీపక్ జాన్‌ను సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. డీసీసీ అధ్యక్షులుగా రెడ్డి (6 ), ముస్లిం (2), ఎస్టీ (4), క్రిస్టియన్ (1) మిగతా ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత, బీసీ సామాజికవర్గానికి చెందిన పున్నా కైలాష్ నేతను నియమించడం విశేషం.
Congress AICC జిల్లా పేరు – డీసీసీ అధ్యక్షులు
- అదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్
- అసిఫాబాద్ – ఆత్రం సుగుణ
- భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవీ ప్రసన్న
- యాదాద్రి భోనగిరి – బీర్ల ఐలయ్య (ఆలేరు ఎమ్మెల్యే )
- గద్వాల – ఎం రాజీవ్ రెడ్డి
- హన్మకొండ – ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి (కుడా చైర్మన్ )
- హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
- జగిత్యాల – గజేంగి నందయ్య
- జనగాం – లకావత్ ధన్వంతి
- జయశంకర భూపాలపల్లి – బట్టు కరుణాకర్
- కామారెడ్డి – మల్లికార్జున్ ఆలె
- కరీంనగర్ – మేడిపల్లి సత్యం (చొప్పదండి ఎమ్మెల్యే )
- కరీంనగర్ కార్పోరేషన్ – వి అంజన్‌కుమార్
- ఖైరతాబాద్ – మోత రోహిత్ ముదిరాజ్
- ఖమ్మం – నూతి సత్యనారాయణ
- ఖమ్మం కార్పోరేషన్ – దీపక్ చౌదరి
- మహబూబాబాద్ – డాక్టర్ భూక్యానాయక్
- మహబూబ్‌నగర్ – ఎ సంజీవ్ ముదిరాజ్
- మంచిర్యాల – పిన్నింటి రఘునాథ్ రెడ్డిత
- మెదక్ – శివన్నగారి అంజనేయులు గౌడ్
- మేడ్చల్ మల్కాజిగిరి – తోట వజ్రేష్ యాదవ్
- ములుగు – పైడాకుల అశోక్
- నాగర్ కర్నూలు – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట ఎమ్మెల్యే )
- నల్గొండ – పున్నా కైలాష్ నేత
- నారాయణపేట – కొల్లుడూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి
- నిర్మల్ – వెడ్మ బొజ్జు ( ఖానాపూర్ ఎమ్మెల్యే )
- నిజామాబాద్ – కాటెపల్లి నాగేష్ రెడ్డి
- నిజామాబాద్ కార్పోరేషన్ – బొబ్బిలి రామకృష్ణ
- పెద్దపల్లి – ఎంఎస్ రాజ్ ఠాకూర్ ( రామగుండం ఎమ్మెల్యే )
- రాజన్న సిరిసిల్ల – సంగీతం శ్రీనివాస్
- సికింద్రాబాద్ – దీపక్ జాన్
- సిద్దిపేట – తూంకుంట ఆంక్షరెడ్డి
- సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య
- వికారాబాద్ – ధారా సింగ్ జాదవ్
- వనపర్తి – కె శివసేనారెడ్డి
- వరంగల్ -మహ్మద్ అయూబ్
