భారత్ గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదుగుదల

భారత్ గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదుగుదల
బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్, సంస్థాగత నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. 2021 నుంచి ఏర్పడిన జీసీసీలలో దాదాపు సగం మొదటి నుంచే ఏఐ ఆధారంగా నిర్మితమైనట్లు నాస్కామ్-జినోవ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొంది.
ఆర్థిక సంవత్సరం 2026 నాటికి భారత్‌లో 3,728 యూనిట్లలో పని చేస్తున్న 2,117 జీసీసీలు ఉన్నాయని, వీటిలో 23.6 లక్షల మంది నిపుణులు పని చేస్తున్నారని నివేదిక తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2021 నుంచి జీసీసీల సంఖ్య 32 శాతం పెరిగింది. అదే సమయంలో ఈ రంగం మొత్తం మార్కెట్ ఆదాయం 98.4 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం భారత్ నుంచి సుమారు 506 ఫోర్బ్స్ గ్లోబల్ 2000 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
భారత్‌లోని 1,200కు పైగా జీసీసీలు, 250కి పైగా ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 2,50,000 మంది ఏఐ నిపుణులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2021 నుంచి స్థాపించిన జీసీసీల్లో దాదాపు సగం ఏఐని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు.
జీసీసీలు పైలట్ ఏఐ ప్రాజెక్టులను దాటి, ఉత్పత్తులు, అంతర్గత కార్యకలాపాలు, కస్టమర్ ఆఫరింగ్స్ అన్నింటిలోనూ ఏఐని అమలు చేస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. కంపెనీలలో చర్చలు ఏఐతో ప్రయోజనాలు, పెద్ద ఎత్తున పాలన, ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించిన ప్రశ్నల వైపు మళ్లాయని నివేదిక తెలిపింది.
భారత్‌లోని సుమారు 50 శాతం జీసీసీలు ఇప్పుడు ఉన్నత పరిపక్వ దశలో పని చేస్తున్నాయని, ఆర్థిక సంవత్సరం 2021 తరువాత స్థాపించిన 96 శాతం జీసీసీలు ఒక ఉత్పత్తి లేదా పోర్ట్‌ఫోలియో ఆదేశంతో ప్రారంభమయ్యాయని ఈ అధ్యయనం పేర్కొంది. 64 శాతం జీసీసీ సైట్ లీడర్లు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, ఏఐ పాలనతో సహా ప్రపంచవ్యాప్త కార్యాచరణ యాజమాన్యంతో పాటు సైట్ నాయకత్వ బాధ్యతలను మిళితం చేసే ద్వంద్వ ఆదేశాలను కలిగి ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. దేశంలో జీసీసీ ఎకోసిస్టమ్ ఫండమెంటల్ రీసెట్ అవుతుందని, ఏఐ ఉత్ప్రేరకంగా పని చేస్తుండగా, పరిమాణం నుంచి విలువకు మారే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోందని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అభిప్రాయపడ్డారు.
