ప్రపంచంలో నంబర్ వన్.. ఏలూరు జిల్లాలో మాత్రం అంతంతే!
- భారతీయ సంస్కృతి, కళలలో మల్లెపువ్వుది ప్రత్యేక స్థానం
- మల్లెల ఉత్పాదనలో ప్రపంచంలో మనమే టాప్
- జిల్లాలో అంతంత మాత్రం అంతంతే..
ఏలూరు కల్చరల్, ఆంధ్రప్రభ: భారతీయ సంస్కృతి, కళలు, ఆచారాలలో మల్లెపూలది ఒక ప్రత్యేక స్థానం. సువాసనకే కాకుండా స్వచ్ఛత, సౌకుమార్యం తెల్లదనానికి, సౌందర్యానికి ప్రతీక మల్లెపువ్వు. “మనసు మల్లె పువ్వు”, “మల్లెపువ్వులా స్వచ్ఛ మైన మనసు”, పళ్ళు తెల్లగా ఉంటే “మల్లెపువ్వులా పళ్ళు తళతశలాడుతున్నాయి” అంటారు. ఇలా మల్లెపూవు కేంద్రంగా అనేక ఉపమానాలు. మల్లెపూలు మరులు గొలుపు తాయి. తెల్లని తెలుపులో, సుగంధ పరిమళంలో మల్లె పువ్వుకు మరే పువ్వు సాటి రాదు. పెళ్ళైనా, పంక్షన్ ఏదైనా గంపలకొద్దీ మల్లెపూలు ఉండ వలసిందే. పూలకు అతివలకు ఉన్న అనుబంధం చాలా గొప్పది అందుకే కాబోలు కొందరు ఇంతులను విరిబోణులని వర్ణించారు.
పూర్వం పెరళ్ళలో మల్లె మొక్కలను పెంచుకునేవారు. అప్పటి నుండి మల్లెపూలు పెట్టుకోవడం ఒక సంప్రదాయంగా వచ్చింది. ఇప్పుడంటే ఎవరూ జడలు వేసుకోవడం లేదు కాబట్టి పూలు పెట్టుకునే అవసరమే లేదు. అది వేరే సంగతనుకోండి. మల్లెపూలు సాధారణంగా సమ్మర్ సీజన్లో విస్తారంగా దొరుకుతాయి. గతంలో వేసవికాలం సాయంత్రం వేళ మల్లెపూలు సైకిళ్ళపై అమ్మకానికి వచ్చేవి. ఒకప్పుడు మల్లెపూలు వేసవి కాలానికే పరిమితమయ్యేవి. ఇప్పుడు విజ్ఞానం పెరిగి సాంకేతిక అందుబాటులోకి రావడంతో ఆరోజు ఈరోజు అనే తేడా లేకుండా ఏడాది పొడవునా మల్లెపూలు దొరుకుతున్నాయి.
మల్లెలలంటే ఇష్టపడనివారు ఉండరు. ఇవి ప్రేమికులు, భార్యా భర్తల మధ్య ఆప్యాయతను, అనురాగాన్ని పెంచుతూ.. వారి వైవాహిక జీవితాలు పరిమళ భరితంగా ఉండేలా చేస్తాయి. రోజంతా కాయకష్టంతో అలిసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, ఆహ్లాదపరిచి మధురానుభూతిని కలిగించేవి మల్లెపూలు. అలసి సొలసిన శరీరానికి మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పడుతుంది. రోజూ తలలో మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చలవ చేసి కంటికి మేలు చేస్తుందని అంటారు.
మల్లెల్లో రకాలు..
బొండుమల్లె, దొంతరమల్లె, బొడ్డు మల్లె, కాగడ మల్లె, కొండమల్లె, నాగమల్లె.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెపూల వార్షిక ఉత్పాదనలో ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. సంవత్స రానికి పన్నెండు లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే వార్షిక ఎగుమతుల్లో రూ. 3,500 కోట్లతో ఈజిప్టు మొదటి స్థానంలో ఉండగా, రూ. 1500 కోట్లతో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇక వార్షిక దిగుమతుల్లో రూ. 4000 కోట్లతో అమెరికా ప్రథమ స్థానంలో, రూ. 3500 కోట్లతో ఫ్రాన్స్ రెండవ స్థానంలో, రూ. 2,500 కోట్లతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి.
మల్లెతోటల సాగువల్ల అనేక మంది ఉపాధి పొందుతున్నారు. తోటల పెంపకం, తోటల్లో పూలు కోయడం, పూలవ్యాపారం, అంతే కాకుండా మల్లెపూలతో వివిధ రకాల అలంకరణల వంటి వాటితో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. మల్లెపూలను కేవలం అలంకరణకే కాకుండా సబ్బులు, హెయిర్ ఆయిల్స్, సౌందర్య సాధనాలు, అగరబత్తీలు మొదలగు వాటి తయారీలో వాడతారు. సెంట్లు, పెర్ఫ్యూమ్ ల తయారీలో మల్లె పూలను ఎక్కువగా వినియోగిస్తారు.
ప్రపంచంలో నెంబర్ వన్ కానీ జిల్లాలో మాత్రం..
మల్లెపూల ఉత్పత్తిలో భారత దేశం సంవత్సరానికి 12 లక్షల టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అయితే ఏలూరు జిల్లాలో అధికారికంగా కేవలం 2.8 ఎకరాల్లో మాత్రమే మల్లెపూలు సాగవుతున్నాయి. మధ్య, పెద్ద తరగతి రైతులు ఉద్యాన పంటల వైపు మరలడం ఒక కారణమైతే ఉపాధి హామీ పథకం మరొక కారణం. మల్లె తోటల సాగుకు కూలీల అవసరం ఎక్కువ. ఏదో ఎకరం, ఎకరం లోపు భూమి ఉన్న వారు మాత్రమే ఈ మల్లె తోటలను పెంచుతున్నారు.
పండ్ల తోటల పెంపకం వైపు రైతు చూపు..
ప్రస్తుతం రైతులు నికరాదాయం వచ్చే పండ్ల తోటల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారని ఉద్యాన శాఖ ఏలూరు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. మల్లె తోటలు మన యేరియా కంటే గుంటూరు జిల్లా మంగళగిరి తదితర ప్రాంతాల్లో మల్లెతోటలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. పట్టణప్రాంత పరిస రాల్లో ఉండేవారు మల్లెపూలను పట్టణాలకు సరఫరా చేస్తారని, ఏలూరు జిల్లా రైతులు ఏలూరు మార్కెట్టుకు సరఫరా చేస్తారన్నారు. మల్లెపూల దిగుబడి వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుందని నిర్వహణ సరిగా ఉంటే రోజుకి ఇరవై నుండి యాభై కిలోల వర కు పూల దిగుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పుడు కూడా దిగుబడి బాగానే ఉంటుందని ఆయన తెలిపారు. తోటలయాజ మాన్యం సక్రమంగా ఉంటే మల్లె తోటల జీవిత కాలం15 నుండి 20 సంవత్సరాలని సక్రమంగా నిర్వహిస్తే మల్లెపూల సాగు లాభ సాటిగా ఉంటుందన్నారు.
వెంకటేశ్వరరావు, మల్లెతోట యజమాని, వీరిశెట్టిగూడెం
నేను మల్లెతోట వేసి పదహారు సంవత్సరాలవుతోంది. ఫిబ్రవరి నుండి మే… మే,జూన్ వరకు దిగుబడి బాగానే ఉంటుంది. సీజన్లో 20 నుండి 25 కేజీలవరకు దిగుబడి వస్తుంది. సీజన్లో ధర ఎక్కువగా ఉంటుంది. పురుగుమందుల ఖర్చు బాగా పెరిగిపోయింది. మొగ్గలు ఉదయాన్నే కోసి సాయంత్రం ఏలూరు మార్కెట్ కు పంపుతాం.

