ఢిల్లీలో 100 ‘అటల్ క్యాంటీన్లు’ ప్రారంభం
వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..
పేదలకు అందుబాటులో చౌక భోజనం..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం నగరవ్యాప్తంగా 100 ‘అటల్ క్యాంటీన్లను’ అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదలు, అవసరమైన వారికి కేవలం రూ.5కే భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.
ఈ 100 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజూ 1,000 మందికి భోజనం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఢిల్లీలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఇది తమ నివాళి అని పేర్కొన్నారు.
ఇక రక్షాబంధన్ పండుగ సందర్భంగా మహిళల కోసం ‘పింక్ కార్డ్’ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రేఖా గుప్తా సూచించారు. ఈ కార్డు ద్వారా ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇంకా కార్డులు పొందని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
గత ఏడాది డిసెంబర్ 26న ఢిల్లీ ప్రభుత్వం ‘అటల్ క్యాంటీన్’ పథకాన్ని ప్రారంభించింది. తొలిదశలో 45 ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 100కు చేరింది. నెహ్రూ నగర్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ హోంమంత్రి ఆశిష్ సూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలి రూ.5 భోజన టోకెన్‌ను మనోహర్ లాల్ ఖట్టర్ జారీ చేసి భోజనం చేశారు.
