టిమ్స్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి దామోదర సమీక్ష
రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం..
పకడ్బందీ ఏర్పాట్లకు అధికారులకు ఆదేశాలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా. ఎంసీఆర్ టిమ్స్) ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రేపు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టిమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు.
అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, వైద్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, ఇతర అతిథులు హాజరుకానున్నందున ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పార్కింగ్, ట్రాఫిక్, భద్రతపై సమీక్ష
కార్యక్రమ వేదిక, ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లను కూడా సమీక్షించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
టిమ్స్ ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్యశాఖతో పాటు పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డా. ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
