పరకాల సభకు కొండా దూరం…

ఆంధ్రప్రభ ప్రతినిధి, ఉమ్మడి వరంగల్‌ : పరకాలలో ఆదివారం జరిగిన ‘ప్రజా పాలన–ప్రగతి బాట’ బహిరంగ సభకు జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కుడా చైర్మన్‌ ఇనగాల వెంకట్రామిరెడ్డి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ సభకు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ.. కొండా సురేఖ, ఇనగాల వెంకట్రామిరెడ్డి రాకపోవడం ఆసక్తి రేపింది.

పరకాల నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ, ఇనగాల వెంకట్రామిరెడ్డి వర్గాల మధ్య విభేదాలపై చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో నిర్వహించిన అల్పాహార సమావేశంతో విభేదాలకు తెరపడిన సంకేతాలు కనిపించాయి. అయితే తాజాగా పరకాలలో జరిగిన ముఖ్యమంత్రి సభకు కొండా సురేఖ, ఇనగాల వెంకట్రామిరెడ్డి గైర్హాజరు కావడం మరోసారి చర్చకు దారితీసింది.

రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

పరకాల నియోజకవర్గంలో రూ.484 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, లక్ష్మణ్‌కుమార్‌, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి సభా వేదికగా ప్రజలను కోరారు. ఇదే సమయంలో నియోజకవర్గంతో ప్రత్యక్ష రాజకీయ సంబంధం ఉన్న కొండా సురేఖ, ఇనగాల వెంకట్రామిరెడ్డి సభకు హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పరకాలతో కొండా కుటుంబానికి అనుబంధం

మంత్రి కొండా సురేఖకు పరకాల నియోజకవర్గంతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. గతంలో ఆమె పరకాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేశారు. కొండా దంపతుల రాజకీయ ప్రస్థానంలో పరకాల నియోజకవర్గం కీలకంగా నిలిచింది.

ఇక ఇనగాల వెంకట్రామిరెడ్డి స్వస్థలం పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు. గతంలో పరకాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. 2023 ఎన్నికల వరకు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం కుడా చైర్మన్‌గా, హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో పరకాల సభకు ఇద్దరు కీలక నేతలు గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. ఇటీవల విభేదాలు సద్దుమణిగినట్లు కనిపించిన నేపథ్యంలో తాజా పరిణామం ఎందుకు చోటుచేసుకుందనే దానిపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారి గైర్హాజరుకు కారణాలు అధికారికంగా వెల్లడికాలేదు.