దేవాదాయ భూముల పరిరక్షణకు కొత్త న్యాయ వ్యవస్థ

దేవాదాయ భూముల పరిరక్షణకు కొత్త న్యాయ వ్యవస్థ

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో దేవుడు మాన్యాల పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో చిక్కుకుని, అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములను కాపాడేందుకు జిల్లాకు ఒక లీగల్ అడ్వైజర్ వ్యవస్థను తీసుకురాబోతున్నది. దేవాదాయ శాఖ చరిత్రలో ఇలాంటి ఒక ప్రత్యేక న్యాయ విభాగం ఏర్పాటు అవుతుండడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా 87,235.39 ఎకరాల భూములు ఉండగా.. అందులో సుమారు 25 వేల ఎకరాలకు పైగా భూమి కబ్జాదారుల చేతుల్లో ఉండటంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాల కోసం పూర్వం కేటాయించిన భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆలయ భూములు 87,235.39 ఎకరాలు ఉండగా, 20,124.03 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. 5,569.35 ఎకరాలు న్యాయపరమైన చిక్కులు లేకుండా కబ్జాలో ఉన్నాయి.

అయితే, కోర్టు వివాదాలు, స్థానిక బడాబాబుల కబ్జాల కారణంగా ఆలయాలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని భూ మాఫియా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నది. ఇప్పటివరకు ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తే జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి కార్యాలయం లేదా ఏజీ ఆఫీసుపై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే లీగల్ అడ్వైజర్లు అందుబాటులో ఉంటారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం, బలంగా వాదనలు వినిపించడం వీరి బాధ్యత. ఆక్రమణదారులకు నోటీసులు పంపడం, ఎండోమెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయించడంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. రెవెన్యూ శాఖతో కలిసి భూముల టైటిల్స్ క్లియర్ అయ్యేలా చూడటం, ఆలయ భూములను నిషేధిత జాబితాలో చేర్పించే ప్రక్రియను వేగవంతం చేయబోతున్నట్లు సమాచారం.

ఆలయాల అభివృద్ధికి దోహదం

భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లీజు గడువు ముగిసిన వారిని ఎలా ఖాళీ చేయించాలి… వంటి అంశాలపై ఆలయ ఈవోలకు లీగల్ అడ్వైజర్లు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఏదైనా లీగల్ సమస్య వస్తే రాష్ట్రస్థాయి కార్యాలయంపై లేదా ఏజీ కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. దీనివల్ల సమయం వృథా అయ్యేది. అంతేకాకుండా ఏ భూమిపై ఏ కేసు విచారణకు వస్తుందనే అంశాలు సైతం రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియడంలో కొంత జాప్యం జరుగుతుందనే సమాచారం.

దీంతో ఆక్రమణదారులకు వరంగా మారుతుండడం, ఆలయ భూములు ఆక్రమణకు ఇది కారణం అవుతుండడంతోనే.. ఇప్పుడు జిల్లాకో అడ్వకేట్ను నియమించడం వల్ల స్థానిక కోర్టుల్లో, ట్రైబ్యునల్స్లో కేసులు వేగవంతం కానున్నాయి. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండటం వల్ల భూ మాఫియా ఎత్తులను సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ నిపుణుల పర్యవేక్షణలో భూముల రక్షణ జరిగితే.. ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయం ఆలయాల అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయనున్నదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 20,124.03 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా.. న్యాయపరమైన చిక్కులు లేని మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆయా జిల్లాల్లో భూముల ధరలు అధికంగా ఉండటంతో భూములకు రక్షణ చర్యలు చేపట్టకపోతే దేవాలయాల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావించిన ప్రభుత్వం జిల్లాకు అడ్వైజర్ను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన భూములను ఆక్రమణ గురికాకుండా కాపాడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.