మాయని మచ్చలా మారిన దళారుల దందా
మాయని మచ్చలా మారిన దళారుల దందా
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల మాయాజాలం నడుస్తోంది. వాహన కొనుగోలుదారులకు అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు చేరక ముందే చేరిపోయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలో, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులో పోస్టల్ ఛార్జీలు వసూలు చేస్తున్నా… కార్డులు మాత్రం ఇంటికి రాకపోవడంతో సామాన్యులు ఆర్టీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలోని షోరూంలలో ప్రతి నెలా గరిష్టంగా లక్ష వరకు వివిధ వాహనాలు కొనుగోలు చేస్తున్నవారు, ప్రతి నెల డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కార్డులు, లైసెన్సుల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహన కొనుగోలుదారుడు చెల్లించిన రుసుములో పోస్టల్ ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. ప్రతి కార్డుకు రూ.35 పోస్టల్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. కార్డులు ముద్రించగానే వాటిని పోస్టు ద్వారా పంపాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కార్డులు పంపకుండానే డిస్పాచ్ అయినట్లు కంప్యూటర్లలో అప్డేట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాగుల్లో వెళ్లాల్సిన కార్డులు కొందరు సిబ్బంది చేతుల్లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి అవి నేరుగా దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీవో కార్యాలయాల్లో లక్షలాది కార్డులు పెండింగ్లో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కార్డులు రాలేదని కార్యాలయాల్లో సిబ్బందిని అడిగితే… సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని సమాచారం. దీనివల్ల రవాణా శాఖకు మచ్చ వస్తోంది. ప్రతీదీ కంప్యూటరీకరణ చేస్తున్నామని.. అవినీతి అక్రమాలకు చోటు లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ అదంతా ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. కార్యాలయాల బయట తిరిగే ఏజెంట్లు, “కార్డు తమ దగ్గర ఉంది” అంటూ వాహన కొనుగోలుదారులకు ఫోన్లు చేసి వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు కింది స్థాయి సిబ్బంది ఈ దళారీలతో కుమ్మక్కై నెలకు లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం గతంలోనే కేంద్రీకృత ముద్రణ విధానాన్ని ప్రతిపాదించింది. అన్ని జిల్లాల కార్డులను ఒకే చోట ముద్రించి, అక్కడి నుంచే నేరుగా పోస్టు చేసేలా ప్రణాళిక రూపొందించారు. కానీ ఇంకా అమలులోకి రాలేదు. టెండర్లు సైతం పిలవలేదని సమాచారం.
ఇది అమలైతే స్థానిక ఆర్టీవో కార్యాలయాల్లో సిబ్బంది జోక్యం ఉండదు. దళారుల ప్రమేయం తప్పుతుంది. నేరుగా వాహన యజమానులకు కార్డులు అందుతాయి. టెండర్ల ప్రక్రియ, ముద్రణ సంస్థలతో ఒప్పందాలు కొలిక్కి రాకపోవడంతో కొందరికి వరంగా మారిందని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కొందరు కింది స్థాయి సిబ్బంది కక్కుర్తి వల్ల రవాణా శాఖ ప్రతిష్ఠ మసకబారుతోంది. ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో కార్డుల అవినీతి మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కేంద్రీకృత ముద్రణను తక్షణమే అమలు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. లేకుంటే శాఖకు వస్తున్న చెడ్డపేరును పోగొట్టాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని పలువురు వాహన యజమానులు కోరుతున్నారు.
