నాగ పంచమి సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం
- ఏళ్ల నాటి నాగదేవతల ప్రతిమలు..
- నాగమ్మ కోరికలు తీరుస్తుందన్న భక్తుల నమ్మకం
- చిన్న గుట్టగా మొదలై.. భారీ రాళ్ల గుట్టగా మారిన వైనం
- చింతలపూడి నాగిరెడ్డిగూడెం గ్రామం నడిబొడ్డున నాగమ్మ తల్లి ఆలయం
చింతలపూడి, ఆంధ్రప్రభ: మీకు ఏదైనా కోరిక ఉందా? అయితే మనస్ఫూర్తిగా నాగమ్మ తల్లిని నమ్ముకుని ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి.. మూడు రాళ్లు వేస్తే చాలు.. కోరిన కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం కారణంగా ఒకప్పుడు చిన్నగా ఉన్న రాళ్ల గుట్ట ఇప్పుడు భారీగా మారింది. అసలు ఈ రాళ్ల గుట్ట కథేంటో తెలుసుకుందామా..
చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో నాగమ్మ తల్లి ఆలయం ఉంది. చూడటానికి చిన్నదిగా కనిపించే ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగమ్మ తల్లికి ఎంతో మహిమ ఉందని స్థానికులు, భక్తులు విశ్వసిస్తారు. ఆలయం వద్ద దాదాపు 60 నుంచి 70 ఏళ్ల నాటి నాగదేవతల ప్రతిమలు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.
మూడు ప్రదక్షిణలు.. మూడు రాళ్లు
ఈ ఆలయ విశిష్టత విషయానికి వస్తే.. ఎవరికైనా కోరిక ఉంటే నాగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముకుని మొక్కుకోవాలి. అనంతరం ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, కోరుకున్న కోరికను మనసులో తలచుకుంటూ మూడు రాళ్లు వేయాలి. ఇలా చేస్తే నాగమ్మ తల్లి తమ కోరికను తప్పకుండా తీరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఏళ్ల తరబడి చింతలపూడి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చి ఈ విధంగా రాళ్లు వేస్తుండటంతో.. ఒకప్పుడు చిన్నగా ఉన్న రాళ్ల గుట్ట క్రమంగా పెద్దదిగా మారిందని నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇస్లావతు రామకృష్ణ తెలిపారు.
వారానికి ఒకసారి పూజలు
గ్రామస్థులు ప్రతిష్ఠించిన నాగమ్మ తల్లికి తాను వారానికి ఒకసారి పూజలు నిర్వహిస్తానని రామకృష్ణ తెలిపారు. తనకు ఏదైనా ఆపద వచ్చినా, కోరిక ఉన్నా నాగమ్మ తల్లిని నమ్ముకుని మనస్ఫూర్తిగా ప్రార్థించి రాళ్లు వేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఆలయంలో భక్తులు సమర్పించిన రాళ్లలో నుంచి కొందరు ఒక రాయిని ఇంటికి తీసుకెళ్లి గుమ్మానికి కడతారని తెలిపారు. ఇలా చేస్తే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవని భక్తుల నమ్మకమని వివరించారు.
నాగుల చవితికి భారీగా భక్తులు
చూడటానికి చిన్న ఆలయమే అయినప్పటికీ నాగుల చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయం ముందు నాగపుట్ట కూడా ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నాగపుట్ట వద్దకు వెళ్లి పూజలు చేస్తారు.
ఏది ఏమైనా రాళ్లు వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్న భక్తుల నమ్మకంతో చిన్నగా మొదలైన రాళ్ల గుట్ట.. నేడు భారీ గుట్టగా మారింది. ఇదే విశ్వాసం కొనసాగితే రానున్న రోజుల్లో ఈ రాళ్ల గుట్ట మరింత పెద్దదిగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు.
