కామారెడ్డి, ములుగు, హన్మకొండలో నేడు పర్యటన
మేడారం నుంచి పరకాల వరకు.. అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం
సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు..
ములుగులో రూ.868 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు
రూ.16,007 కోట్ల రహదారి ప్రాజెక్టుకు పైలాన్ ఆవిష్కరణ..
పరకాలలో రూ.484.42 కోట్ల పనులకు శంకుస్థాపనలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదివారం ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, ములుగు, పరకాల ప్రాంతాల్లో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మేడారం జాతర ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మేడారం తెలంగాణలోని ప్రముఖ ఆదివాసీ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా ఉంది.
మేడారంలో వనదేవతలకు పూజలు
సీఎం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో మేడారం చేరుకోనున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చేయూత పింఛనుదారులకు మంజూరు పత్రాలను అందజేయడంతో పాటు, మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. మేడారం జాతర ప్రాంతాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి మేడారం అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ములుగులో భారీ అభివృద్ధి పనులు
మేడారం నుంచి ములుగు చేరుకున్న అనంతరం గట్టమ్మ ఆలయ సమీపంలో పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పనులకు సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అలాగే రూ.868 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా పరిపాలనకు కీలకంగా మారనున్న రూ.63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. దీంతో జిల్లా పరిపాలనకు సంబంధించిన పలు శాఖలు ఒకే సముదాయంలో అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఏర్పడనుంది.
పరకాలపై సీఎం ప్రత్యేక దృష్టి
ములుగు పర్యటన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. పరకాల నియోజకవర్గంలో మౌలిక వసతులను బలోపేతం చేసేలా మొత్తం రూ.484.42 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. పరకాల పట్టణంలో తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఆసుపత్రి భవనం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యుత్ ఉపకేంద్రాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు.
అదే సమయంలో పరకాల పరిసర ప్రాంతాల్లో నాలుగు వరుసల రహదారి, ఉర్దూఘర్, యువత కోసం ఆధునిక సాంకేతిక కేంద్రం, యంగ్ ఇండియా సమీకృత నివాస పాఠశాల వంటి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు.
అక్కంపేటకు ఆదర్శ గ్రామ హోదా దిశగా
ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులతో చేపట్టే పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణ మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేలా పనులు చేపట్టనున్నారు.
మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో మేడారం ఆధ్యాత్మిక ప్రాధాన్యం, ములుగు జిల్లా పరిపాలనా మౌలిక వసతులు, పంచాయతీరాజ్ రహదారులు, పరకాల పట్టణాభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల వంటి అంశాలకు ప్రాధాన్యం దక్కనుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క నేతృత్వంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
