సెంట్రల్లో యువ మంత్రం..
- లోకేష్ నోట హలో యువ
- సిద్ధార్థకు సెంట్రల్ బాధ్యత..
- రానున్న కార్పొరేషన్ సమరానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలంటూ సూచన…
- మంత్రి నారా లోకేష్, టీడీపీ యువ నేత బొండా సిద్ధార్థ మధ్య ఆసక్తికర సంభాషణ..
- సెంట్రల్లో అన్ని డివిజన్లలో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం…
- ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న సిద్ధార్థ..
- సేవా కార్యక్రమాలతో యువతలో ప్రత్యేక గుర్తింపు…
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో యువ నాయకత్వం దూకుడు పెంచుతోంది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు, టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సింగ్‌నగర్ వచ్చిన మంత్రి నారా లోకేష్‌ను సిద్ధార్థ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యువ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్న తరుణంలో ఈ భేటీ సెంట్రల్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.
లోకేష్ ‘హలో యువ’.. ఆసక్తికర పలకరింపు…
మంత్రి నారా లోకేష్‌ను బొండా సిద్ధార్థ కలిసి కరచాలనం చేశారు.‘‘హలో యువ’’ అంటూ సిద్ధార్థను లోకేష్ ఆప్యాయంగా పలకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొద్దిసేపు ఆసక్తికర సంభాషణ జరిగినట్లు సమాచారం. సిద్ధార్థ రాజకీయ కార్యకలాపాల గురించి లోకేష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.ఈ దృశ్యం అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది.
కార్పొరేషన్ సమరానికి ఇప్పటి నుంచే కసరత్తు..
రానున్న మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని లోకేష్ సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.సెంట్రల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని చెప్పినట్లు సమాచారం.డివిజన్ల వారీగా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం కీలకమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత భాగస్వాములను చేసే అంశంపైనా దృష్టి పెట్టాలని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో సిద్ధార్థ పాత్రపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం…
ఎస్ఐఆర్ కార్యక్రమంలో సిద్ధార్థ పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు.ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పథకాల సమాచారంతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు.
ఉపాధికి చేయూత.. సేవలో తనదైన ముద్ర…
పీ-4 కార్యక్రమంలో మార్గదర్శిగా సిద్ధార్థ తనవంతు పాత్ర పోషిస్తున్నారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల జీవనోపాధికి అవసరమైన సహాయంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.అవసరమైన వారికి సొంత నిధులతో కుట్టుమిషన్లు, ఇస్త్రీ పెట్టెలు అందించారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తోపుడు బండ్లు సమకూర్చి స్వయం ఉపాధికి చేయూతనిచ్చారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ యువ నాయకుడిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.
