MALLEPOOLA PALLAKI |థియేటర్లు గుళ్ళు అవుతాయి..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ‘ఇరుముడి’ సినిమా నుంచి విడుదలైన ఈ పాటలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు రవితేజ మాస్ ఎనర్జీ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ అంటూ ఇప్పటికే అయ్యప్ప భక్తుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ పాటను ‘ఇరుముడి’ కోసం కొత్తగా మలిచారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ పాటకు తనదైన టచ్ ఇవ్వగా.. ఒరిజినల్ భక్తి భావం తగ్గకుండా, సినిమాటిక్‌గా మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. ఈ క్లాసిక్ అయ్యప్ప భక్తి గీతాన్ని రీమిక్స్ చేస్తున్నట్లు గతంలో జి.వి. ప్రకాశ్ కుమార్ కూడా వెల్లడించారు. ఓ ప్రత్యేక సందర్భంలో విడుదల చేస్తామని చెప్పగా.. ఈ రోజు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ పాటను విడుదల చేశారు.
పాట కోసం ఫ్యాన్స్‌లో అంత ఆసక్తి ఎందుకు?
‘ఇరుముడి’ టైటిల్ నుంచే ఈ సినిమాకు అయ్యప్ప భక్తితో బలమైన కనెక్షన్ ఏర్పడింది. సినిమాలో రవితేజ అయ్యప్ప దీక్ష తీసుకునే నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైంది. అంతే కాకుండా తండ్రి–కూతురు బంధం, భావోద్వేగం, ఆధ్యాత్మికత, క్రైమ్, యాక్షన్ అంశాలు కలిసిన కథగా సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే వచ్చిన ‘ఇరుముడి కట్టు’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ‘మల్లెపూల పల్లకి’ విషయంలో మాత్రం అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఇది సాధారణ సినిమా పాట కంటే భక్తి గీతంగా చాలామందికి ముందే పరిచయం ఉన్న పాట కావడంతో.. సినిమాలో దీన్ని ఎలా చూపిస్తారన్న ఆసక్తి మొదటి నుంచే నెలకొంది.
“ఈ పాట లేకపోతే ఎలా?”.. ఫ్యాన్స్
‘మల్లెపూల పల్లకి’ని సినిమాలో పెట్టాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి బలంగా వినిపించింది. సోషల్ మీడియాలో కూడా ఈ పాటపై ముందుగానే చర్చ జరిగింది. “ఈ పాట పెట్టకపోతే డైరెక్టర్‌కు బేరింగ్ ఇస్తాం” అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేసే స్థాయిలో ఈ పాటపై క్రేజ్ కనిపించింది. ఇప్పుడు పాటను రిలీజ్ చేయడంతో ఆ ఎదురుచూపులకు తెరపడింది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు, రవితేజ అభిమానులు కలిసి ఈ పాటను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు.
రవితేజకు మరో డిఫరెంట్ షేడ్..
‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చేయని తరహా పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. సినిమాలో ఆయన పాత్రకు కూతురితో ఉన్న అనుబంధం కీలకంగా ఉండటంతో పాటు.. కథలో వచ్చే పరిణామాలు ఆయన పాత్రను పూర్తిగా మార్చేలా ఉంటాయని విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ సూచిస్తున్నాయి. అందుకే ‘మల్లెపూల పల్లకి’ పాటలో కనిపించే రవితేజ పాత్ర కూడా సినిమా కథలో ఒక ముఖ్యమైన సందర్భాన్ని ప్రతిబింబించే అవకాశం ఉంది.
శివ నిర్వాణ–రవితేజ కాంబినేషన్‌పై ఆసక్తి..
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ కథలను తెరకెక్కించిన శివ నిర్వాణ.. ఈసారి రవితేజతో భిన్నమైన జానర్‌ను టచ్ చేస్తున్నారు. ‘ఇరుముడి’లో కుటుంబ భావోద్వేగాలను భక్తి, యాక్షన్ అంశాలతో కలిపే ప్రయత్నం చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది.
ఆగస్టు 21న థియేటర్లలో ‘ఇరుముడి’
‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21, 2026న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ‘మల్లెపూల పల్లకి’ పాట ఆ అంచనాలకు మరింత భక్తి టచ్‌ను జోడించింది. అయ్యప్ప భక్తి గీతానికి రవితేజ మాస్ ఎనర్జీ, జి.వి. ప్రకాశ్ సంగీతం, శివ నిర్వాణ సినిమాటిక్ ట్రీట్‌మెంట్ కలవడంతో ‘మల్లెపూల పల్లకి’ ప్రస్తుతం ‘ఇరుముడి’ ప్రమోషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక థియేటర్లలో ఈ పాటకు పూనకాలు రావడం ఖాయమని తెలుస్తోంది.
