డూమ్స్ డే ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మార్చుకున్న డ్యూన్ 3 ?

  • డ్యూన్‌కు డూమ్స్‌డే సవాల్‌.. హాలీవుడ్‌లో భారీ క్లాష్‌
  • డిసెంబర్‌లో డబుల్‌ ధమాకా..

ఆంధ్రప్రభ : మ‌రో మూడు నెల‌ల్లో బాక్సాఫీస్ వ‌ద్ద‌ భారీ పోరు జరగనుంది. ఒకవైపు డెనిస్‌ విల్లెన్యూవ్‌ తెరకెక్కిస్తున్న ‘డ్యూన్‌: పార్ట్‌ త్రీ’.. మరోవైపు మార్వెల్‌ స్టూడియోస్‌ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’… రెండు భారీ చిత్రాలు ఒకే రోజున (డిసెంబర్‌ 18న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్‌ పోటీపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. భారత్‌లోనూ, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాల కోసం ఎదురుచూపులు పెరిగాయి.

‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’తో నేరుగా బాక్సాఫీస్‌ క్లాష్‌ ఉండటంతో ‘డ్యూన్‌ 3’ను ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 4 నుంచే ‘డ్యూన్‌ 3’ను ఐమాక్స్‌లో ప్రదర్శించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. డిసెంబర్‌ 18న జరగనున్న అధికారిక విడుదలకు నాలుగు రోజుల ముందే ఐమాక్స్‌ ప్రేక్షకులకు ఈ చిత్రం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. అయితే డిసెంబర్‌ 4 ఐమాక్స్‌ ప్రదర్శనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘డ్యూన్‌ 3’పై భారీ అంచనాలు

డెనిస్ విల్లెన్యూవ్ తన ‘డ్యూన్’ ట్రయాలజీని ‘డ్యూన్: పార్ట్ త్రీ’తో ముగించనున్నారు. ఈ కథను ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన ‘డ్యూన్ మెస్సయ్య’ ఆధారంగా రూపొందిస్తున్నారు. తిమోతీ షాలమెట్, జెండయా, ఫ్లోరెన్స్ ప్యూ, జాసన్ మోమోవా, రెబెక్కా ఫెర్గూసన్, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ‘డ్యూన్‌’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. మూడో భాగాన్ని ఐమాక్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఐమాక్స్‌ అధికారికంగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న థియేటర్లలో, ఐమాక్స్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో 70ఎంఎం ఐమాక్స్‌ ప్రదర్శనలకు టికెట్లను కూడా ముందుగానే విక్రయిస్తోంది.

‘డూమ్స్‌డే’లో మార్వెల్‌ మల్టీవర్స్‌

మరోవైపు ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’పై కూడా భారీ అంచనాలున్నాయి. రస్సో బ్రదర్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐర‌న్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్‌ డౌనీ జూనియర్‌.. డాక్టర్‌ డూమ్‌గా కనిపించనున్నాడు. క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, క్రిస్‌ ఎవాన్స్‌, ఆంథనీ మాకీ, పెడ్రో పాస్కల్‌, ఫ్లోరెన్స్‌ పగ్‌, వెనెస్సా కిర్బీతో పాటు పలువురు ప్రముఖ నటులు ఇందులో భాగమవుతున్నారు. ఎక్స్‌-మెన్‌ పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండనున్నాయి. మూడు వేర్వేరు విశ్వాలకు చెందిన హీరోలు ఒకే కథలో ఎదురుపడేలా ‘డూమ్స్‌డే’ను రూపొందిస్తున్నారు. దీంతో మార్వెల్‌ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.

ఐమాక్స్‌ స్క్రీన్లే కీలకం!

రెండు సినిమాలూ ఒకే రోజున విడుదల కావడంతో అసలు పోటీ కేవలం బాక్సాఫీస్‌ వసూళ్లకే పరిమితం కాకుండా.. ఐమాక్స్‌ వంటి ప్రీమియం స్క్రీన్ల విషయంలోనూ ఆసక్తికరంగా మారింది. ‘డ్యూన్‌: పార్ట్‌ త్రీ’ను ఐమాక్స్‌ కోసం రూపొందించడంతో ఆ సినిమాకు పెద్ద స్క్రీన్లపై ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది. ఇక ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ కూడా భారీ ప్రీమియం ఫార్మాట్‌ వ్యూహంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డ్యూన్‌ 3 కోసం ఐమాక్స్‌ స్క్రీన్లను కేటాయించాల్సి రావడంతో మార్వెల్‌ ఇతర ప్రీమియం స్క్రీన్‌ ఎంపికలపై దృష్టి పెడుతోంది.

బార్బెన్‌హైమర్‌ తరహాలో మరో క్లాష్‌?

2023లో ‘బార్బీ’, ‘ఓపెన్‌హైమర్‌’ ఒకే రోజున విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ రెండు చిత్రాల కలయికకు అభిమానులు ‘బార్బెన్‌హైమర్‌’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు 2026లో ‘డ్యూన్‌ 3’, ‘అవెంజర్స్‌: డూమ్స్‌డే’ ఒకే రోజున రావడంతో ఇలాంటి మరో సినిమా సంస్కృతి ఏర్పడుతుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే అభిమానులు ఈ క్లాష్‌ను సరదాగా ‘డ్యూన్స్‌డే’ అంటూ పిలుస్తున్నారు. రెండు సినిమాలకూ ప్రత్యేకమైన అభిమానగణం ఉండటంతో.. ఎవరి సినిమా ప్రారంభ వసూళ్లలో పైచేయి సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం మాత్రం డ్యూన్‌: పార్ట్‌ త్రీ, అవెంజర్స్‌: డూమ్స్‌డే రెండూ డిసెంబర్‌ 18, 2026న విడుదల కానున్నాయి. దీంతో క్రిస్మస్‌ సీజన్‌కు ముందే హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే.