నిజాయితీ చాటుకున్న ఆలయ హోంగార్డులు
నిజాయితీ చాటుకున్న ఆలయ హోంగార్డులు
భక్తురాలు మరిచిపోయిన పర్సు అప్పగింత
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మరిచిపోయిన పర్సును తిరిగి అందజేసి ఆలయ హోంగార్డులు తమ నిజాయితీని చాటుకున్నారు.
సోమవారం ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు తన పర్సును ఆలయ ప్రాంగణంలో మరిచిపోయింది. పర్సులో ఐడెంటిటీ కార్డుతో పాటు రూ.2,000 నగదు ఉండగా, దానిని గమనించిన ఆలయ హోంగార్డులు నారాయణ, ఇందళ్ వెంటనే ఆలయ మైక్ ద్వారా ప్రకటన చేయించారు.
అనంతరం పర్సులో లభించిన ఐడెంటిటీ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా సంప్రదించగా, అది కుంటాల మండలం లింబాకే గ్రామానికి చెందిన చిల్లావార్ సుమలతదిగా గుర్తించారు. అనంతరం ఆమెకు పర్సును క్షేమంగా అందజేశారు. హోంగార్డుల నిజాయితీపై భక్తులు ప్రశంసలు కురిపించగా, ఆలయ సిబ్బంది కూడా వారిని అభినందించారు.
