Adilabad | పవిత్ర గంగాజలంతో ఇందిరాదేవి వద్దకు చేరిన పాదయాత్ర

Adilabad | పవిత్ర గంగాజలంతో ఇందిరాదేవి వద్దకు చేరిన పాదయాత్ర

  • ఇందిరాదేవికి సాంప్రదాయ పూజలు
  • కేస్లాపూర్ కు పయనమైన మెస్రం వంశీయులు

Adilabad | ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ జాతరకు గత నెల రోజుల ముందు నుంచే మెస్రం వంశీయులు వివిధ సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టారు. గత నెల 30న‌ మెస్రం ఖటోడ (పూజారి) కోసే రావ్, హన్మంతు, దర్ము, కొత్వాల్ తిరుపతి, దాదే రావ్ ల ఆధ్వర్యంలో కేస్లాపూర్ లోని మురాడి (పురాతన దేవాలయం) వద్ద వారి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసి జన్నారం మండలంలోని పవిత్ర గోదావరి గంగాజలం కోసం హస్తినమడుగుకు బయలు దేరారు.

Adilabad

హస్తినమడుగు గంగ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి.. గంగా జలం సేకరించి వివిధ గ్రామ పొలిమేరలో బస చేస్తూ 15 రోజుల సుధీర్ఘ కాలి నడకన ప్రయాణంతో ఇవాళ‌ ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఖటోడ (పూజారులు) కటోడ హనుమంతరావు, మెస్రం కోసే రావ్, ధర్ముల ఆధ్వర్యంలో నవధాన్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా వారి సాంప్రదాయ వాయిద్యాలైన కాలి కొమ్, తుడుం వాయిస్తూ పూజలు చేయడం సాంప్రదాయం.

  • ఇందిరాదేవికి గారెలతో ప్రసాదం…

ఇందిరాదేవి ఆలయం వద్ద మహిళలు ప్రత్యేకంగా గారెలు, జొన్న గటకతో నైవేద్యాన్ని సమర్పించారు. అక్కడ మధ్యాహ్నం ఉపవాస దీక్షలు విడిచిన తరువాత సాయంత్రం వేళలో బండెనక బండి కట్టి కేస్లాపూర్ కు పయనమయ్యారు. అక్కడ వట వృక్షం వద్ద పూజ అయ్యే వరకు మూడు రోజుల పాటు బస చేస్తారు. నాగోబా పీఠాధపతి పటేల్ మెస్రం వెంకట్ రావ్ కు నాగోబా పూజకు రావాలని ఆహ్వానం పలుకుతారు. మరుసటి రోజు తమ పూర్వీకులకు తూమ్ (కర్మ కాండలు) జరుపుతారు. జనవరి 18న పుష్యమాసం అర్ధరాత్రి నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి జాతరను ఆరంభిస్తారు.

Leave a Reply