ఎస్ టీ ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు

ఎస్ టీ ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు
భువనగిరి లో అరెస్ట్… అదుపులోకి తీసుకున్న ఏసీబీ
మోత్కూర్ కార్యాలయం, భువనగిరి నివాసంలో సోదాలు
రికార్డుల పరిశీలించిన అధికారులు
నేడు ఏసీబి కోర్టు లో హాజరు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఎండి ఖదీర్ అవినీతిపై ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం మోత్కూర్ లోని ఎస్ టి ఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అంతకుముందు భువనగిరి లో డి టి ఓ కార్యాలయంలో ఖదీర్ ని అరెస్టు చేసి నేరుగా మోత్కూర్ లోని ఎస్ టి ఓ కార్యాలయం కి తీసుకొచ్చి విచారణ చేసి, పలు రకాల రికార్డులను పరిశీలించి ,స్టేట్మెంట్ రికార్డు చేశారు.
విచారణ అనంతరం నల్గొండ రేంజ్ ఏ సి బి డి ఎస్పీ జగదీశ్ చందర్ విలేకరులతో మాట్లాడుతూ మోత్కూర్ ఎస్ టి ఓ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఎం డి ఖదీర్ అవినీతి పై ఈ నెల 4 న నల్గొండ ఏసీబీ రేంజ్ కార్యాలయంలో మోత్కూర్ ఎంపీఓ గా పనిచేస్తున్న ఫైళ్ల జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు తాము రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

గుండాల ఎంపీఓ గా పని చేసి మోత్కూర్ కి బదిలీ పై వచ్చిన జనార్దన్ రెడ్డి తన 38 రోజుల పెండింగ్ శాలరీ కోసం సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ రూ.5000 లంచం కోరగా , ఖదీర్ తో పాటు సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న నిరంజన్ కి ఫోన్ పే చేయమని ఖదీర్ చెప్పడంతో జనార్దన్ రెడ్డి ఫోన్ పే చేశాడని,ఆర్ధిక సంవత్సరం చివరి నెల మార్చి కావడంతో ఫిబ్రవరి నెల వేతనం కూడా వచ్చేలా చూడాలని జనార్దన్ రెడ్డి ఖదీర్ ని కోరగా ఐ టి సమస్య ఉందని బెదిరించడంతో మరో రూ.5000 నేరుగా ఖదీర్ కి ఫిబ్రవరి 27 న ఫోన్ పే చేసినట్లు తెలిపారు.
రూ.10 వేలు లంచం ఇచ్చినప్పటికీ బిల్లు ఆలస్యం కావడంతో సదరు ఎంపీఓ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారని,కలెక్టర్ డి టి ఓ ను విచారణ అధికారిగా నియమించి మోత్కూర్ ఎస్ టి ఓ కార్యాలయంలో విచారణ చేసినట్లు తెలిపారు. గుండాల ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మరో ఉద్యోగి సైతం ఫిబ్రవరి నెల శాలరీ కోసం రూ.5000 ఖదీర్ డిమాండ్ మేరకు నేరుగా ఫిబ్రవరి 27 న ఫోన్ పే చేశారని వివరించారు.సీనియర్ అకౌంటెంట్ నిరంజన్ తనకు ఫోన్ పే చేసిన అమౌంట్ రూ.5 వేలు తిరిగి ఎంపీ ఓ కి వాపస్ చేసినట్లు తెలిపారు.
వీరిద్దరు అధికారులు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఎం డి ఖదీర్ పై కేసు నమోదు చేసి, భువనగిరి లో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని కార్యాలయంలో సోదాలు నిర్వహించి,స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు సదరు అకౌంట్లను ,ఆయా రికార్డులను పరిశీలించామన్నారు.ఆదాయం కి మించి ఆస్తులు ఉన్నాయా అన్న అనుమానంతో భువనగిరి లోని ఖదీర్ నివాసంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహించామన్నారు. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టు లో సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ ని హాజరు పరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ విలేకరుల కి తెలిపారు. సుమారు 2 గంటల పాటు ఎస్ టి ఓ కార్యాలయంలో సోదాలు, విచారణ కొనసాగగా ఏసీబీ బృందం అధికారులు పాల్గొన్నారు.
లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ కి ఫిర్యాదు చేయాలి…
ఏసీబీ నల్గొండ రేంజ్ డీఎస్పీ జగదీష్ చందర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఆయా పనుల నిమిత్తం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్ కి నేరుగా ఫిర్యాదు చేస్తే,ఆధారాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటామని,టోల్ ఫ్రీ తో పాటు ట్విట్టర్,ఫేస్ బుక్,క్యూ ఆర్ కోడ్ ద్వారా సైతం ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తామని తెలిపారు.
