అధ్వానంగా రోడ్డు.. నాటు వేసి నిరసన

మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలని బీజేపీ నాయకుల డిమాండ్

సదాశివనగర్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. గుంతలమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, ప్రస్తుతం రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్నారు.

జాతీయ రహదారి నుంచి నూతన గ్రామపంచాయతీ కార్యాలయం వరకు బీటీ రోడ్డు నిర్మించినప్పటికీ, అక్కడి నుంచి రామారెడ్డి వైపు వెళ్లే రహదారి వరకు పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. రోడ్డు సౌకర్యం సరిగా లేక వాహనదారులతో పాటు పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన రహదారి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు దృష్టి సారించడం లేదని, సంబంధిత అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రోడ్డు నిర్మాణంపై అధికారులు తక్షణమే స్పందించకపోతే గ్రామస్తులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొప్పుల గంగారెడ్డి, పొలాబోయిన సాయిలు, ఏనుగు జైపాల్‌రెడ్డి, బంధాల సాగర్‌, గంగోళ్ల నవీన్‌, వడ్ల రాజమౌళి, మ్యాదరి ధర్మపురి, దువ్వల మోహన్‌, నల్ల గంగాధర్‌, చిట్టెపు ఆశన్న, పెసరి భూమయ్య, చౌకి భాస్కర్‌, బాయికాడి నారాయణ, కటికే మహేష్‌, నిమ్మలబోయిన శివరాం, బెస్త బాలరాజు, మాలకమ్మరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.