బస్ డిపో పనుల్లో నాణ్యత ఏదీ?
నిర్మాణ పనులను పరిశీలించిన సీపీఎం నాయకులు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన బస్ డిపో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం జిల్లా నాయకుడు కల్లెపల్లి అశోక్ ఆరోపించారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత లేని మెటీరియల్ వినియోగిస్తున్నట్లు తమ పరిశీలనలో కనిపించిందని ఆరోపించారు. ముఖ్యంగా బెడ్, పిల్లర్ల నిర్మాణంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాధనంతో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అన్నారు.
నిర్మాణ పనులను సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, వినియోగిస్తున్న నిర్మాణ సామగ్రి నాణ్యతను నిపుణులతో పరీక్షించాలని డిమాండ్ చేశారు. పనుల్లో నాణ్యతా లోపాలు నిర్ధారణ అయితే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టును రద్దు చేయాలని కోరారు.
