పశ్చిమ టీడీపీ పగ్గాలు బుద్ధా వెంకన్న చేతికి..
- కూటమి ఐక్యతే బలం.. స్థానిక ఎన్నికలకు సిద్ధం : గద్దె అనురాధ
- నా రాజకీయ తొలి అడుగు వెంకన్నతోనే : ఎంపీ కేశినేని చిన్ని
- పార్టీ కోసం నాలుగడుగులు వెనక్కి.. శత్రువుపై పది అడుగులు ముందుకు : బుద్ధా వెంకన్న
- చంద్రబాబు, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బుద్ధా వెంకన్న శనివారం ప్రమాణ స్వీకారం అట్టహసంగా చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీఫ్‌తో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు బుద్ధా వెంకన్న జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
నా రాజకీయ అడుగు బుద్దాతోనే..
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ బుద్ధా వెంకన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు కూడా బుద్ధా వెంకన్న ద్వారానే ప్రారంభమైందని పేర్కొన్నారు. తనను పశ్చిమ నియోజకవర్గానికి పరిచయం చేసిన వ్యక్తుల్లో వెంకన్న ముఖ్యుడని అన్నారు. అత్యధిక మంది కార్యకర్తలు ఉన్న నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటే తమకు వేదమని, కూటమి నాయకులంతా సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
టిడిపికి కంచుకోటల పశ్చిమ..
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం మహిళలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బుద్ధా వెంకన్న పశ్చిమ నియోజకవర్గానికి పెట్టని కోటలా ఉంటారని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే నాయకుడని కొనియాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మరోసారి కలిసి పోటీ చేయబోతుందని తెలిపారు. పార్టీ కోసం అవసరమైన చిన్నచిన్న త్యాగాలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పార్టీ కోసం నాలుగు అడుగులు వెనక్కి.. ప్రత్యర్థి కోసం పది అడుగులు ముందుకు..
ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే విషయంలో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం నాలుగడుగులు వెనక్కి తగ్గినా, శత్రువుల విషయంలో పది అడుగులు ముందుకు వేస్తామని అన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ పోరాటాలు చేసిన పట్టాభి సేవలను ఆయన ప్రస్తావించారు. పట్టాభి మాటల ముందు ఎవరూ సరిపోరని పేర్కొన్నారు. గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ మాజీ పార్లమెంట్ సభ్యుడిపై బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని గతంలో చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వెల్లంపల్లి శ్రీనుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయనను రాజకీయ నాయకుడు కాదని, పైరవీల నాయకుడని విమర్శించారు. రాజకీయంగా రంగులు మార్చే వ్యక్తిగా అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. పార్టీ కోసం, నాయకత్వం కోసం కార్యకర్తలంతా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
