తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
- మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామంలోని కురువగేరిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు ఉప్పరి అశోక్ సాగర్ మరోసారి ముందుకొచ్చారు. గతంలో బోరు, మోటార్ ఏర్పాటు చేసిన ఆయన, ఇప్పుడు మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
శుక్రవారం బీరప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉప సర్పంచ్ సాబెన్నతో పాటు స్థానికుల సమక్షంలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, కురువగేరిలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజల విజ్ఞప్తి మేరకు ఉప్పరి అశోక్ సాగర్ తన సొంత నిధులతో బోరు తవ్వించి, మోటార్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు.
బోరు, మోటార్, మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఉప్పరి అశోక్ సాగర్ దాతృత్వాన్ని కొనియాడిన గ్రామస్తులు, గతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు, పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి రావడానికి తన సొంత ఖర్చుతో ఆటో సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాంటి పదవి లేకపోయినా గ్రామ ప్రజల అవసరాలకు స్పందిస్తూ సేవలు అందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉప్పరి అశోక్ సాగర్ మాట్లాడుతూ, సామాజిక సేవను తాను బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. గ్రామంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా తన శక్తి మేరకు సహాయం చేస్తానని చెప్పారు. ప్రజల కోరిక మేరకు మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ప్రారంభించామని, పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, వార్డు సభ్యుడు సత్యరెడ్డి, నాయకులు రాకేష్ సాగర్, శ్రీనివాసులు, బి. మహేష్ ముదిరాజ్, పాలకృష్ణయ్య ముదిరాజ్, శ్రీధర్ ముదిరాజ్, ఆశన్న, నరేందర్ రెడ్డి, నీరటి శివారెడ్డి, దాసరి శ్రీనివాసులు, ఎం. రాజు, కురువ లింగప్ప, కురువ రమేష్, నరేందర్ గౌడ్, మంథన్‌గోడ్ సోషల్ మీడియా కన్వీనర్ తుమ్మలంపు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
