జన్నారం, (ఆంధ్రప్రభ) : అటవీ అధికార్లు వేధించారని మండలంలోని గడ్డంగూడవాసి రాథోడ్ తుకారాం గురువారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని జన్నారం, కొత్తూరు పల్లె గ్రామ సమీపంలో ఉన్న గడ్డంగూడ చెందిన 22 మంది గిరిజనుల గుడిసెలను అటవీ అధికార్లు జేసీబీ, ట్రాక్టర్లతో తొలగించారు.
దీంతో ఆ గిరిజనులు నిరాశ్రాయులయ్యారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో గురువారం ఉదయం జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ ఎస్. సుష్మారావు ఆధ్వర్యంలో పలువురు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్,బీట్ ఆఫీసర్లు ఆ గడ్డంగూడ వద్దకు వెళ్లి సీసీ కెమెరాలు అ మార్చుతామని తెలిపారు.
దీంతో బాధిత గిరిజనుల్లో ఒకరైన రాథోడ్ తుకారాం,పలువురు గిరిజనులు రెండు రోజుల గడువు ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు. అయినప్పటికీ సీసీ కెమెరాలు పెట్టడానికి అటవీ అధికారులు ఉపక్రమించారు.దీంతో తుకారాం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా, అక్కడున్న తోటి గిరిజనులు వెంటనే జన్నారం ఎఫ్డీఓ కార్యాలయానికి తరలించారు.
అక్కడే తుకారాంతో కుటుంబ సభ్యులు,పలువురు గిరిజనులు ధర్నాకు దిగారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని చావు బతుకుల మధ్య ఉన్న తుకారాంను చికిత్స నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు.
ప్రస్తుతం తుకారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.తుకారాంకు ప్రాణాప్యాయమేమీ లేదని ఓ వైద్యుడు తెలిపారు.ఈ విషయమై ఇన్ఛార్జి రేంజ్ ఆఫీసర్ సుష్మారావును వివరణ కోరగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జన్నారం అటవీ బీట్ లోని కంపార్ట్మెంట్ నెంబర్ 308 రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో సీసీ కెమెరాల అమర్చడానికి పోలీసులు,తన ఉద్యోగులతో వెళ్లానన్నారు.తాను ఎవరిని దూషించలేదని,వేధించలేదని ఆమె స్పష్టం చేశారు.
గడ్డంగూడ గిరిజనులను అటవీ అధికారిణి వేధించింది
పురుగుల మందు తాగి చావండి అంటూ అటవీ అధికారిణి తిట్టిందని లోతొర్రే మాజీ ఉప సర్పంచి బోడ శంకర్ ఆరోపించారు. స్థానిక ఎఫ్డీఓ కార్యాలయం ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గడ్డంగూడ ప్రాంతానికి ఆ అధికారిణి వచ్చి గిరిజనులను ఇష్టం వచ్చినట్టు తిట్టి, వేధించిందని ఆయన తెలిపారు. గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
గిరిజనులకు న్యాయం చేస్తా : ఇంచార్జి మంత్రి సీతక్క
గడ్డంగూడ అటవీ బాదిత గిరిజనులకు న్యాయం చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.జన్నారం గురువారం వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను పలువురు గడ్డంగూడ బాధిత గిరిజనులు కలిసి తమ గోడును విన్నవించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,తాను రాష్ట్ర ముఖ్యమంత్రితో అటవీ శాఖ మంత్రితో మాట్లాడి న్యాయం జరిగేలాగా చూస్తానన్నారు.ఆమె వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఉన్నారు.