ఫైనల్ టికెట్ కోసం కీలక పోరు..
ముంబై (ఆంధ్రప్రభ): మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్ధమైంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో దూకుడైన ఆటతో సత్తా చాటిన భారత మహిళా జట్టు, ఇప్పుడు తొలి వరల్డ్‌కప్ ట్రోఫీకి కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది.
గతంలో రెండు సార్లు ఫైనల్‌కు చేరినా టైటిల్ చేజారడం భారత జట్టుకు చేదు అనుభవం. ఈసారి మూడో ప్రయత్నంలో చరిత్ర సృష్టించాలని టీమిండియా సంకల్పించింది.
దీంతో ఈరోజు ముంబై వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్ ఉత్కంఠంగా మారింది. ఆసీస్ తో లీగ్ దశలో తడబడ్డప్పటికీ, భారత్ ఈ పోరులో గెలిస్తే ఐసీసీ ట్రోఫీ కల సాకారం అవుతుంది.
ఇకపోతే, మహిళల వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో 7 సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా, ఈసారి కూడా లీగ్ దశలో అజేయంగా జైత్రయాత్ర కొనసాగించింది. టాప్ స్థానం దక్కించుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ 8వ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సెమీస్‌లోకి చేరింది. లీగ్ దశలో భారత్ భారీగా 330 పరుగులు చేసినా, ఆ స్కోరును రక్షించలేక ఆసీస్ చేతిలో ఓడిపోయింది.
ప్రస్తుతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమతౌల్యంగా ఉన్నా, ఆసీస్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే సెమీస్‌కు ముందు టీమిండియాకు ఒక ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీక రావల్ గాయంతో జట్టుకు దూరమైంది. ఆమె స్థానంలో దిగబోతున్న షెఫాలి వర్మపై భారీ అంచనాలు ఉన్నాయి.
బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ లతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. మరోవైపు బౌలింగ్‌లో క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, దీప్తి శర్మ, శ్రీ చరణి, స్నేహ్ రాణా లు విజృంభిస్తే ఆసీస్‌ను కట్టడి చేయడం టీమిండియాకు కష్టమేమీ కాదు.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్.
ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లిస్ పెర్రీ, బెన్ మూనీ (వికెట్ కీపర్), అలీసా హీలీ (కెప్టెన్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డనర్, తాహిలా మెక్‌గ్రాత్, జార్జియా వెర్హామ్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగన్ స్కాట్.
