Machilipatnam | ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తున్నారు..

Machilipatnam | ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తున్నారు..

  • సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లో అక్రమ పార్కింగ్ ఫీజుల వసూళ్లు
  • కఠిన చర్యలు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు

Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జిఓ ఎంఎస్ నెంబర్ 44, తేదీ 24-03-2025 ప్రకారం సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ తదితర వాణిజ్య సంస్థలు తమ ప్రాంగణంలో వినియోగదారులకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘిస్తూ అనేక చోట్ల పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం జరుగుతోందన్నారు.

కొన్ని ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజు చెల్లించకపోతే వాహనాలను లోపలికి అనుమతించకపోవడం, వినియోగదారులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా ఉండవలసిన “పార్కింగ్ ఫీజు లేదు / పార్కింగ్ ఫ్రీ ” అనే బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఈ విధమైన అక్రమ చర్యలు ప్రభుత్వ ఆదేశాలకు, వినియోగదారుల హక్కులకు పూర్తిగా విరుద్ధమైనవిగా ఉండి, ప్రజలకు ఆర్థికంగా మరియు మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పడవల మోహన్ త్రినాథ్,
హేమ సుందర్ పాల్గొన్నారు.

Leave a Reply