Jaggayapeta | భద్రతతో సురక్షిత ప్రయాణం

Jaggayapeta | భద్రతతో సురక్షిత ప్రయాణం

  • జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఎంవీఐ ఎంవీఎన్ నారాయణ రాజు

Jaggayapeta | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంటపాలెంలో ఉన్న మోటార్ వెహికల్ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారి మీదుగా ఆర్‌టీసీ డిపో వరకు అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంవీఐ ఎంవీఎన్ నారాయణ రాజు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణం చేస్తేనే ప్రాణాపాయ ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించడంతో పాటు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు నడపడానికి అనుమతించరాదని హెచ్చరించారు. కార్లు నడిపే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ శాఖ సిబ్బంది, రాంకో, కేసీపీ, అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారాల సిబ్బంది, జగ్గయ్యపేట మోటార్ వెహికల్ డీలర్లు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.