ఈ నెల 7 నుంచి యోగా పోటీలు..
ఈ నెల 7 నుంచి యోగా పోటీలు..
తొలిదశలో గ్రామ, వార్డు స్థాయిలో ఉత్సాహంగా ఆరంభం
ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొనాలి
యోగాంధ్ర-2026ను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : సమాజంలోని ప్రతి వర్గానికి యోగా పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించే యోగాంధ్ర-2026లో భాగంగా ఈ నెల 7 నుంచి యోగా పోటీలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్ – గ్రాస్‌రూట్స్ వెల్‌నెస్ ఇతివృత్తంతో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో విజేతలు మండల స్థాయికి, మండలస్థాయిలో విజేతలు జిల్లాస్థాయికి, అక్కడ విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు యునిటీ త్రో యోగా-బ్రిడ్జింగ్ కమ్యూనిటీస్ థీమ్‌తో మండలస్థాయిలో, ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు యోగా అండ్ యూత్ – బిల్డింగ్ ఎ హెల్దీ ఫ్యూచర్ థీమ్‌తో జిల్లాస్థాయిలో, ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగాంధ్ర-ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్‌తో రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీలో పోటీలు ఉంటాయని.. వ్యక్తిగత కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం ప్రదర్శనలు, గ్రూపు కేటగిరీలో సింక్రనైజ్డ్ గ్రూపుయోగా ఉంటుందన్నారు. యోగా సాంగ్, యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే పోటీలు కూడా ఉంటాయని వివరించారు. జూనియర్ (10-18 ఏళ్లు), యంగ్ (19-35 ఏళ్లు), సీనియర్ గ్రూప్ (35 ఏళ్లు, ఆపైన) విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జ్ఞానాధారిత పోటీలు మినహా మిగిలిన పోటీలను పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు 84980 12833, 83413 64185 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
