TET | విద్యా హక్కు చట్టాన్నిసవరించాలి…

TET | విద్యా హక్కు చట్టాన్నిసవరించాలి…
- టెట్ మినహాయింపు కోరుతూ ఫిబ్రవరి 5న ఢిల్లీలో మార్చ్ టు పార్లమెంట్..
- జనవరి 9న నల్లబ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాల సమర్పణ..
- ఐక్య ఉద్యమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి రావాలి…
TET | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుండి మినహాయించాలని టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) ని రద్దు చేసి పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్.పి.ఎస్, సి.పి.ఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన ఆయన పునరుద్ఘాటించారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంటు మార్చ్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం గానీ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటిఈ) గానీ ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
23 ఆగస్టు 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మినహాయింపు ఇచ్చినట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్న ఎన్సీటిఈ సుప్రీంకోర్టుకు ఆ విషయాన్ని తెలియజేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది పాఠశాలలు మూతపడి, పేద పిల్లలకు విద్య దూరమయ్యే ప్రమాదం నెలకొంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థలో సంక్షోభానికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటిఈ లే బాధ్యత వహించాలని అన్నారు. తక్షణమే కేంద్రం సుప్రీం కోర్టులో రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని లేదా సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే విధంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని, అన్ని జిల్లాల నుండి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి మెమోరాండంలు పోస్టు చేయాలని, ఫిబ్రవరి 5న ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ మార్చ్ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
