Died | బావిలో పడి…

Died | బావిలో పడి…
- పదో తరగతి విద్యార్థి చరణ్ మృతి
- తల్లిదండ్రుల గుండెలు పగిలే విషాదం
Died | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన హనుమంతు–సాయమ్మ దంపతుల కుమారుడు, తలమర్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి చరణ్ (15) ఇవాళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
సమీపంలో బహిర్భూమికి వెళ్లిన చరణ్ అక్కడే ఉన్న బావిలో పడిపోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి స్థానిక పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోటార్ల సహాయంతో పోలీసులు బావిలో నుంచి చరణ్ మృతదేహాన్ని బయటకు తీశారు.
విద్యార్థి చరణ్ అంత్యక్రియలకు ఇవాళ హాజరైన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చరణ్ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చదువుకునే వయసులోనే విద్యార్థి మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంలో కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు హనుమంతు, సాయమ్మలను ఎమ్మెల్యే ఓదార్చారు. “దేవుడు కడుపుకోత మిగిల్చాడు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ కుటుంబానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండల టీడీపీ కన్వీనర్, వడ్డెర్ల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, రామకృష్ణ, తలమర్ల సింగిల్ విండో అధ్యక్షులు గోపాల్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సాలెక్క శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, సూరి తదితర కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
