NTR District | ఇగ్నైట్… ఇక అంతా బ్రైట్

NTR District | ఇగ్నైట్… ఇక అంతా బ్రైట్
NTR District | కలెక్టర్ వినూత్న ఆలోచనతో రూపకల్పన..
జిల్లా అభివృద్ధి దిశలో కీలక అడుగు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆపన్నహస్తం
ప్రజల ఆర్థిక స్వావలంభన పెంపొందించడమే లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా ఆర్థికాభివృద్ధికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
రాజధానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లా ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ప్రజల ఆర్థిక స్వావలంభన సాధింపే లక్ష్యాలతో ప్రత్యేకంగా ఇగ్నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదాయ మార్గాల అన్వేషణ, ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం వంటి అంశాలతో రూపొందించింది. జిల్లా అభివృద్ధికి ఇది దిక్సూచిగా మారనుంది. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ అందరినీ అమితంగా ఆకర్షిస్తుంది.
NTR District | ఎన్టీఆర్ బ్యూరో,ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ప్రజల్లో ఆర్థిక స్వావలంబన పెంపొందించడం లక్ష్యంగా నూతనంగా ‘ఇగ్నైట్’ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించింది. కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా అభివృద్ధిలో కీలక అడుగుగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.
పంచ సూత్రాలతో కార్యక్రమ రూపకల్పన..
ప్రధానంగా ఐదు అంశాల అభివృద్ధే లక్ష్యంగా యంత్రాంగం ఇగ్నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదాయ వృద్ధి, వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతికత, ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం అనే అంశాల ఆధారంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఐదు అంశాల సమన్వయం ద్వారా జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఇగ్నైట్ ఏర్పడింది.
ఒకే చోట సమగ్ర సమాచారం..
ఇగ్నైట్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించే ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మహిళా, యువజన సేవలు వంటి విభాగాలు తమ తమ సేవలను ఈ స్టాల్స్ ద్వారా ప్రజలకు వివరించాయి. వీటి ద్వారా ప్రజలు ఒకే చోట వివిధ శాఖల సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
స్టార్టప్‌లకు ప్రోత్సాహకరంగా..
ప్రత్యేకంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే యువతకు ఈ కార్యక్రమం ఇగ్నైట్ మార్గదర్శిగా నిలుస్తోంది. ఏ శాఖ ద్వారా ఎటువంటి రుణాలు లభిస్తాయి, సబ్సిడీలు ఎలా పొందాలి, సాంకేతిక సహాయం ఎక్కడ లభిస్తుంది, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై నిపుణులైన అధికారులు ప్రత్యక్షంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ చర్యలతో యువతలో ఉన్న సృజనాత్మక ఆలోచనలు వెలికి వచ్చి, వారు ఉద్యోగాల కోసం వెతకడం కంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ప్రోత్సాహం లభిస్తోంది. భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కార్యక్రమం బలమైన పునాదిగా నిలుస్తోంది.
ఆదాయ మార్గాల పెంపుపై దృష్టి..
ఇగ్నైట్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై స్పష్టమైన అవగాహన లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా చిన్నతరహా వ్యాపారాలు, గృహ పరిశ్రమలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన పొందుతున్నారు. దీంతో కుటుంబాల ఆదాయం పెరిగి, పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడనుంది.
ఆత్మ విశ్వాసంతో ముందడుగు..
కలెక్టరేట్‌ను సందర్శించే ప్రజలకు ఈ కార్యక్రమం వారిలో సానుకూల దృక్పథాన్ని కలిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు వారికి ఎలా ఉపయోగపడతాయో ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రజలు వారి భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలనే ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఈ కార్యక్రమం, జిల్లా పారిశ్రామిక ప్రగతిలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇతర జిల్లాలకు కూడా ఆదర్శవంతమైన నమూనాగా మారే అవకాశముంది. జిల్లా అభివృద్ధి పథంలో ఒక కీలక మార్పును తీసుకువస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషించనుంది.
CLICK HERE TO READ MORE 782Crores | సంతానలేమి జంటలకు సువర్ణావకాశం
