TFI | ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు..

  • టాలీవుడ్ పోరులో పెద్దలదే పైచేయి..
  • ఉత్కంఠగా సాగి ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.
  • ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం..
  • 2027 వరకు సురేష్ బాబు సేన పాలన..

ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం ఫిలింనగర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో అగ్ర నిర్మాతలతో కూడిన ‘ప్రొగ్రెసివ్ ప్యానెల్’ ఘనవిజయం సాధించి తన బలాన్ని నిరూపించుకుంది. ఈ విజయంతో సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

హోరాహోరీ పోరులో ప్రొగ్రెసివ్ ప్యానెల్ హవా

మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యుల (EC Members) కోసం జరిగిన ఈ ఎన్నికల్లో ‘ప్రొగ్రెసివ్ ప్యానెల్’ నుంచి 31 మంది విజయం సాధించగా, చిన్న నిర్మాతల అభ్యున్నతే లక్ష్యంగా బరిలోకి దిగిన ‘మన ప్యానెల్’ నుంచి 17 మంది గెలుపొందారు. ఉదయం నుంచి జరిగిన పోలింగ్‌లో మొత్తం 3,355 మంది సభ్యులకు గాను 43 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రారంభమైన లెక్కింపులో మొదట స్టూడియోస్ సెక్టార్‌లో మన ప్యానెల్ ఆధిక్యం కనబరిచినప్పటికీ, అత్యంత కీలకమైన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ సెక్టార్లలో ప్రొగ్రెసివ్ ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది.

నూతన కార్యవర్గ వివరాలు

  • అధ్యక్షుడు: సురేష్ బాబు దగ్గుబాటి
  • ఉపాధ్యక్షుడు: నాగవంశీ, భారత్ చౌదరి
  • కార్యదర్శి: అశోక్ కుమార్
  • జాయింట్ సెక్రటరీ : మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి
  • కోశాధికారి: ముత్యాల రామదాసు

ఈ కార్యవర్గంలో వీరితో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈసీ మెంబర్లుగా ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, జెమిని కిరణ్, కొల్లి రామకృష్ణ వంటి వారు విజయం సాధించారు. ఈ ఎన్నికల ద్వారా ఎన్నికైన నూతన బాధ్యులు 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.

పరిశ్రమ సవాళ్లే లక్ష్యంగా కొత్త కమిటీ

తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల వ్యవస్థ, చిన్న సినిమాల మనుగడ, నిర్మాణ వ్యయం వంటి కీలక సమస్యల పరిష్కారం కోసం ఈ నూతన కమిటీ కృషి చేయనుంది. పెద్ద నిర్మాతల ఆధిపత్యం ఉన్న ప్యానెల్ విజయం సాధించడంతో, రానున్న రెండేళ్లలో పరిశ్రమలో ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబుకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Leave a Reply