NEW YEAR జోష్ లో హ‌ద్దుమీరితే ఉపేక్షించం..

NEW YEAR జోష్ లో హ‌ద్దుమీరితే ఉపేక్షించం..

  • 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్
  • రంగంలోకి 7 ప్లాటూన్ల అదనపు బలగాలు
  • మ‌ఫ్టీలో 15 షీ టీమ్స్‌ నిఘా

ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యంత పటిష్టమైన చర్యలు చేపట్టింది. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ పర్యవేక్షణలో 2026 నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు.

వేడుకల పేరుతో హద్దు మీరి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని సీపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా 100కు పైగా ఆకస్మిక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా ఉంచనున్న‌ట్టు తెలిపారు.

ఇందుకోసం ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించిన‌ట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని తక్షణమే సీజ్ చేయడంతో పాటు, రూ. 10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పార్టీలకు వెళ్లేవారు ముందుగానే క్యాబ్ సౌకర్యాన్ని చూసుకోవాలని లేదా మద్యం సేవించని డ్రైవర్‌ను నియమించుకోవాలని సూచించారు.

వేడుకల సమయంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 15 షీ టీమ్స్ (SHE Teams) మఫ్టీలో నిఘా ఉంచనున్నాయి. పబ్‌లు, హోటళ్లు, ప్రధాన కూడళ్ల వద్ద నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని తక్షణమే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఈవెంట్ నిర్వాహకులకు కూడా కఠిన నిబంధనలు విధించారు. పబ్‌లు, హోటళ్లలో వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. శబ్ద కాలుష్య నిబంధనలు పాటిస్తూ డెసిబెల్స్ పరిమితి మించకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమిస్తే సౌండ్ సిస్టమ్స్‌ను సీజ్ చేస్తామన్నారు. పార్టీలలో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగితే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులను రద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ నిబంధనల ప్రకారం సురక్షితంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని సీపీ కోరారు.

Leave a Reply