కూలిపోయే ప్రాజెక్టులు కట్టి.. ఇరిగేషన్ గురించి పాఠాలు చెబుతున్నారా…

- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్
ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తెలంగాణను అప్పుల ఊబిలో ముంచి, పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ ఇచ్చిన కౌంటర్ ఇచ్చారు.
కూలిపోయే ప్రాజెక్టులకు లక్షల కోట్ల అప్పులు..
మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి, ఆ భారాన్ని ప్రజలపై మోపి నామమాత్రపు ఆయకట్టును మాత్రమే తెచ్చారు అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సైతం తప్పుబట్టారని గుర్తు చేశారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం అంచనాలను భారీగా పెంచారని, తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు అని చెప్పి, దాన్ని కూలిపోయేలా చేశారని ఆరోపించారు. రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా రైతులకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు.
పాలమూరు, నల్గొండ ప్రజలకు సమాధానం చెప్పాలి
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ (SLBC), దిండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో మహబూబ్‌నగర్, నల్గొండ ప్రజలకు సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రూ. 38,500 కోట్లతో పూర్తవ్వాల్సిన పాలమూరు ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఎందుకు వెచ్చించారో చెప్పాలి అని నిలదీశారు.
నీటి పారుదల శాఖను నాశనం చేశారు
కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది కేసీఆర్ మాత్రమేనని, ఆ పాపానికి ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ పూర్తిగా నాశనమైందని ఉత్తమ్ ఆరోపించారు. కేవలం అప్పులు తేవడం, అంచనాలు పెంచడం తప్ప క్షేత్రస్థాయిలో సాగునీరు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ఎంతో సమర్థంగా పోరాడుతోందన్నారు. రూ. 18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కూలిపోయిన బ్యారేజీలు కట్టిన వారు ఇరిగేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
