Chittoor Collector | పల్స్ పోలియో కార్యక్రమం..

Chittoor Collector | పల్స్ పోలియో కార్యక్రమం..

Chittoor Collector | చిత్తూరు, బ్యూరో,ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా కలెక్టర సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని చిత్తూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, నిండు జీవితానికి రెండే చుక్కలు అని పేర్కొంటూ, పల్స్ పోలియో చుక్కలు అంగవైకల్యం నుంచి పిల్లలను కాపాడే అద్భుతమైన రక్షణ కవచమని అన్నారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పల్స్ పోలియో అదనంగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం పోలియో వ్యాధి రాష్ట్రంలో జీరో స్థాయిలో ఉన్నప్పటికీ, మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసులు కనిపిస్తున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తగా ప్రతి సంవత్సరం ఒక రోజు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వివరించారు.

Chittoor Collector

చిత్తూరు జిల్లాలో మొత్తం 69 పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న 2,21,502 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం 142 రూట్లలో 212 వాహనాలు, 1,415 పోలియో బూతులు, సుమారు 5,800 మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. మొత్తం 2,94,600 పోలియో వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సిడిపివోలు, ఎంఈవోలు, వైద్యాధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తారని తెలిపారు. పోలియో బూతుల వద్ద ఎంఎల్‌హెపీలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సేవలు అందిస్తారని చెప్పారు.

Chittoor Collector

డీఎంహెచ్ఓ డాక్టర్ డి.టి. సుధారాణి మాట్లాడుతూ, ఈ పల్స్ పోలియో కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. తొలి రోజు బూత్‌లలో, రెండో మరియు మూడో రోజులు ఇంటింటికి వెళ్లి ‘ఎక్స్’, ‘పీ’ మార్కులు వేస్తూ, మిగిలిపోయిన పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా అందరూ సమన్వయంతో పనిచేసి, పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు కార్పొరేషన్ మేయర్ ఆముద, చుడా చైర్మన్ హేమలత, డీఎంహెచ్ఓ డాక్టర్ డి.టి. సుధారాణి, డాక్టర్ వెంకట ప్రసాద్, డాక్టర్ హనుమంతరావు, నరసింహ ప్రసాద్, డాక్టర్ లోకేష్, వివిధ ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply