ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల పక్షపాతి
- మహిళల ఆర్థిక స్వావలంబన–స్వయం ఉపాధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష
- మెగా చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సవిత
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ తెలిపారు. పెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో మంత్రి సవితమ్మ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా స్వయం సహాయక సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ లని పరిశీలించారు. అనంతరం మహిళల సశక్తీకరణ, ఆర్థిక స్వావలంబన, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
గ్రామీణ మహిళల అభివృద్ధిలో స్వయంసహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, మహిళల సామాజిక-ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని సమీక్షిస్తూ, వాటిని మరింత వేగవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు.
మహిళల జీవనోపాధిని మెరుగుపరచడంలో, వారి ఆదాయ వనరులను విస్తరించడంలో ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తుందని మంత్రి సవితమ్మ స్పష్టంచేశారు.
అనంతరం మంత్రి సవితమ్మ మాట్లాడుతు… తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున అమలు చేశామని, మహిళకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్నామని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ. 20 వేలు అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిన పెడుతూ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం మొత్తం వివిధ పథకాల క్రింద లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. శ్రీనిధి రుణం కింద 1974 సభ్యులకు మొత్తం రూ. 18 కోట్లు 6 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.సామాజిక పెట్టుబడి ఉన్నతి బ్యాంక్ లింకేజ్ ద్వారా 1413 మందికి రూ. 138.46 కోట్లు విడుదల అయ్యాయి.
సీడ్ క్యాపిటల్ పధకం క్రింద 141 మందికి రూ. 55.10 లక్షలు చెల్లించబడింది.రైతు ఉత్పత్తిదారులకు రూ. 1 కోటి 3 లక్షల 94 వేల రూపాయల సహాయం అందించబడగా,ఓ ఎస్ ఎస్ సి ఎఫ్ పథకం క్రింద 49 లబ్ధిదారులకు రూ. 24.50 లక్షలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నరసయ్య, సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు జిల్లా మండల స్థాయి అధికారులు, మహిళా నాయకులు, స్వయంసహాయక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
