GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్
GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్
ఏడాదిలో 11,531 యూనిట్ల రక్తం సేకరణ.
GGH | (కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) బ్లడ్ బ్యాంక్ రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రక్త యూనిట్లు సేకరించిన కేంద్రంగా నిలిచి స్టేట్ ఫస్ట్ అవార్డును అందుకుంది. బ్లడ్ కలెక్షన్, సేవల నాణ్యత, అత్యవసర సమయాల్లో స్పందన, సమర్థవంతమైన సిబ్బంది పనితీరు వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ, సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “ఒకే సంవత్సరం వ్యవధిలో 11,531 బ్లడ్ యూనిట్లు సేకరించడం అనేది రాష్ట్రంలోనే అత్యధికం. ఇది మా బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది, స్వచ్ఛంద దాతల సమిష్టి కృషి ఫలితం. ఈ గుర్తింపు కర్నూలు జీజీహెచ్ సేవల ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తుంది” అని అన్నారు.
విజయవాడలో ఘన సత్కారం
డిసెంబరు 1న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు వేదికపైకి వెళ్లి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపినట్లు సమాచారం.
సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
అవార్డు నేపథ్యంపై స్పందించిన డా. వెంకటేశ్వర్లు “బ్లడ్ బ్యాంక్ వైద్యులు డాక్టర్ సుదీర్, డాక్టర్ రసూల్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రంగస్వామి మరియు ఇతర సిబ్బంది అత్యుత్తమ నిబద్ధతతో పనిచేశారు. వారందరి కృషిని ఈ అవార్డు గుర్తించింది” అని పేర్కొన్నారు.
సేవల విస్తరణకు అవకాశాలు
ఈ గుర్తింపుతో జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌కు రాష్ట్రస్థాయి ప్రోత్సాహం లభించడమే కాకుండా, భవిష్యత్‌లో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు, సదుపాయాల మెరుగుదలకు అవకాశాలు పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
