ఆదోని మండల పునర్విభజనకు గెజిట్ జారీ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఉత్తర ప్రాంతానికి కేంద్రంగా ఉన్న ఆదోని మండల పరిపాలనా వ్యవస్థలో మరో కొత్త మార్పుకు పునాది పడింది. ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో, స్థానిక పరిపాలనలో కొత్త శకానికి నాంది పలికినట్టే అయ్యిందని జిల్లా అధికారులు తెలిపారు.

పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న భౌగోళిక పరిధి, ప్రజలకు సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం జీవో ఆర్.టి. నం.1503 (తేదీ 27-11-2025) ప్రకారం ఆదోని మండలాన్ని ‘ఆదోని’, ‘పెద్దహరివాణం’ అనే రెండు మండలాలుగా విభజిస్తూ గెజిట్ నం.796 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు. దీని ద్వారా భవిష్యత్ పరిపాలనా పటంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.

రెండు మండలాలుగా విభజన – గ్రామాల ప్రణాళిక

ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా… ఆదోని మండలం ప్రధాన కేంద్రంగా ఆదోని పట్టణాన్ని నిర్ణయిస్తూ మొత్తం 29 గ్రామాలను ఈ మండల పరిధిలో చేర్చారు. వాటిలో ఆదోని, కల్లుబావి, వెంగళాపురం, పర్వతాపురం, మండిగిరి, ఎస్.కొండాపురం, ఇస్వీ, గోనబావి, దిబ్బనకల్లు, నెట్టేకల్లు, ఆరెకల్, బైచిగేరి, సలకలకొండ, విరుపాపురం, దొడ్డనకేరి, సాంబగల్లు, హువ్వనూరు, కపటి, బసరకోడు, చిన్నపెండేకల్లు, బల్లేకల్లు, మాంత్రికి, దెయ్యాలగూడెం, పాండవగల్లు, కుప్పగల్లు, జాలిమంచి, సుల్తానాపురం, పెసలబండ, పెద్దతుంబళం గ్రామాలు ఉన్నాయి.

పెద్ద హరివనం మండలం గా…

ఇక పెద్దహరివాణం మండలం ప్రధాన కేంద్రంగా పెద్దహరివాణం గ్రామాన్ని నిర్ణయిస్తూ మొత్తం 17 రెవెన్యూ గ్రామాలను ప్రతిపాదించారు. వాటిలో పెద్దహరివాణం, సంతేకూడ్లూరు, యడవల్లి, బలదూరు, చిన్నగోనెహాలు, చిన్నహరివాణం, మదిరె, కడితోట, హానవాళు, జి.హోసళ్లి, బసాపురం, వి.కొండాపురం, నాగనాథనహళ్లి, నారాయణపురం, చాగి, ఢణాపురం, గణేకల్లు గ్రామాలు ఉన్నాయి.

ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు…

మండల విభజన వల్ల ఏమి మారుతుందనే అంశంపై అధికారులు వివరించారు. పరిపాలనా పరిధి చిన్నదిగా మారడం వలన ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం అవుతుందని, పౌరుల సమస్యలను అధికారులు మరింత దగ్గరగా పర్యవేక్షించగలరని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఆదోని మండలంలోని అంతర్భాగ గ్రామాలకు పరిపాలనా సేవల చేరువ పెరుగుతుంది.

పెద్దహరివాణం మండలంగా ఏర్పాటవడం ద్వారా ఆ ప్రాంతంలోని దూరప్రాంత గ్రామాలకు ప్రత్యేక దృష్టి లభిస్తుంది. భౌగోళికంగా విస్తారంగా ఉన్న ప్రస్తుత ఆదోని మండలం రెండుగా విడిపోవడంతో రికార్డుల నిర్వహణ, వ్యవసాయ, ఆదాయ, భూ సంస్కరణలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల పరిధి సమన్వయం వంటి అంశాలలో సౌలభ్యం ఏర్పడనుంది.

స్థానిక ప్రజల్లో కూడా మండల విభజనపై మిశ్రమ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు గ్రామాల కేటాయింపులో తమ అభ్యంతరాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

30 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించవచ్చు

జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ… విభజనకు సంబంధించిన ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు లేదా మార్పు ప్రతిపాదనలు ఉంటే, వాటిని 30 రోజుల్లోపు కర్నూలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు. అందిన అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.ఈ నోటిఫికేషన్‌తో ఆదోని ప్రాంత పరిపాలనా రూపకల్పనలో కీలకమైన మార్పు చోటు చేసుకోబోతోందని, భవిష్యత్‌లో ఈ రెండు మండలాలు స్వతంత్ర పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని జిల్లా అధికారులు అభిప్రాయపడ్డారు.