Maktal | కార్తీకదీపోత్సవ వేడుకలకు ఉమామహేశ్వరాలయం ముస్తాబు

Maktal | కార్తీకదీపోత్సవ వేడుకలకు ఉమామహేశ్వరాలయం ముస్తాబు

  • 20న ముక్కంటి దేవుడికి 33,333 దీపార్చన

మక్తల్, ఆంధ్రప్రభ : కార్తీక అమావాస్య సందర్భంగా ఈ నెల 20న మక్తల్ పట్టణం ఆజాద్‌నగర్‌లోని ఉమామహేశ్వరాలయంలో 33,333 దీపాలతో ప్రత్యేక దీపార్చన జరగనుంది. కార్తీకదీపోత్సవం కోసం ఆలయ కమిటీ సభ్యులు దేవాలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అద్భుతంగా అలంకరించారు.

గత 30 రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం ఆలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమావాస్య రోజున జరిగే ఈ సమూహ దీపార్చనకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

శివ–కేశవులకు కార్తీక అమావాస్య రోజున దీపారాధన చేస్తే జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీ ఉమామహేశ్వరాలయంలో గత కొద్ది సంవత్సరాలుగా ముక్కంటికి 33,333 దీపార్చన, లక్ష దీపోత్సవంగా నిర్వహించడం సంప్రదాయంగా మారింది.

ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో జాతీయ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంతర్జాతీయ యోగా–ధ్యాన శిక్షణ నిపుణులు, ఆధ్యాత్మిక ప్రచారకులు మహర్షి సాధు మహారాజ్ రఘోత్యమాచార్య ముఖ్య వక్తగా పాల్గొని ధార్మిక ప్రవచనం అందించనున్నారు.

దీపోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరై కార్తీక దీపాలను వెలిగించి శ్రీ ఉమామహేశ్వరుల కృపకు పాత్రులుగా నిలవాలని ఆలయ కమిటీ సభ్యులు బి. ఆంజనేయులు సూర్య, చిన్న కృష్ణయ్య, సివి. ఆంజనేయులు, బి. శ్రీనివాసులు, పోలెపల్లి అనంతకుమార్ భక్తులను కోరారు.

Leave a Reply