KTR | పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్!

KTR | పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్!
- ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Adilabad | ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : పత్తి రైతు కు అండగా ఉండాల్సిన సీసీఐ కొర్రీలతో ఆగ దగా చేస్తోందని, పత్తి రైతుల కష్టాలు తొలగాలంటే ప్రజా పోరాటాలే శరణ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
తొలుత అదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో పత్తి, సోయా రైతులను కలిసి మార్కెట్లో ఎదురవుతున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… తాము మార్కెట్ యార్డ్(Market Yard) కు వస్తున్నామంటే అధికారులు మార్కెట్ పంట కొనుగోళ్లను నిలిపివేశారని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణంగా పత్తి కొనుగోలు, సోయా రైతుల పరిస్థితి మారిందన్నారు.
కిసాన్ కపాస్ మొబైల్ అప్లికేషన్ తీసుకువచ్చి దాని ద్వారానే పంటలు కొంటాం అని ఆంక్షలు విధిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కనీసం ఫోన్లు లేని రైతన్నల పరిస్థితి ఏమిటి? ఆదిలాబాద్ లో మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ(Mobile Network Connectivity) ఉండదని ఇలాంటి పరిస్థితుల్లో సీసీఐ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో భారీగా వర్షాలు పడటం పైగా అకాల వర్షాల ప్రభావంగా పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండడం సహజమేనన్నారు. చలి కూడా గతంలో కంటే ఎక్కువగా ఉన్నందున పత్తిలో తేమశాతం పెరగదా? అని ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 20 నుండి 22% తేమ(20 to 22% humidity) ఉన్న పంటను కూడా కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 12 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామనడం విడ్డూరం కాదా అని నిలదీశారు.
రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేరని, కనికరం లేని పాలకులపై రైతులు పోరాడాలని కేటీఆర్ సూచించారు. సీసీఐ మెడలు వంచేవరకూ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీసీఐ(CCI) కనీసం ఇప్పటిదాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొనలేదనీ, ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. కనీస మద్దతు ధర క్వింటాలకు రూ 8,110 ఉంటే, రైతుకు ఐదారు వేలు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సోయాబీన్(Soybean) అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సొంత తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పంటలు బిడ్డలు అమ్మాలంటే కూడా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తి పంట ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటామనీ ఒక అర్థరహితమైన నిబంధన పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ లో ఉన్న భూసార పరిస్థితుల వల్ల 15 క్వింటాళ్ల(15 quintals) వరకు ఎకరానికి పండుతుందని, మరి మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. తాము రైతులను కలుస్తున్నామని తెలిసి వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా చర్చలు మొదలుపెట్టిందని, సమస్యలపై చలనం రావడం సంతోషంగా ఉందన్నారు. తేమశాతం నిబంధన ఎత్తేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో పత్తి రైతుల(cotton farmers) సమస్యలు ఎందుకు ప్రస్తావించలేదని రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు.
ఈ నెల 21న జరిగే జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లోని బోరజ్ లోఉంటుందని కేటీఆర్ తెలిపారు. రైతు సంఘాలు అన్ని కలిసి చేస్తున్న కార్యక్రమానికి రైతన్నలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్(MLA Vidyasagar), మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్ రావు, దుర్గం చిన్నయ, జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

