COLLECTORATE | సమస్య పరిష్కరించడం లేదని..
కలెక్టరేట్‌లో విషం తాగిన మహిళ
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా వి కోట మండలం మిట్టూరుకు చెందిన నందిని అనే మహిళ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే మహిళా పోలీసులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషం తాగిన నందినికి ఏడాదిన్నర వయసున్న బిడ్డ ఉండడం పలువురిని కలచివేసింది. వి కోట మండలం మిట్టూరుకు చెందిన నందిని కుటుంబానికి ఒక ఎకరా భూమి ఉంది. ఆ భూమికి దారి కోసం అనేకసార్లు కలెక్టరేట్‌కి వచ్చారు. స్థానికంగా తహసీల్దార్‌ను కలిశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. బంధువులే దానికి ఆటంకాలు కలిగిస్తున్నారు.

ఇటీవల ఈ విషయంలో పోలీసు కేసు కూడా అయ్యింది. స్థానిక తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదని నందిని అత్త తెలిపారు. వారికి వంశపారపర్యంగా ఎకరా భూమి సంక్రమించిందని, దానికి దారి లేకుండా బంధువులే చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు జిల్లా, మండలాధికారులకు విన్నవించినా, సమస్య పరిష్కారం కాలేదన్నారు. కావున కోడలు నందిని విషం తాగిందని ఆమె వివరించారు.

