Bihar | బీహార్ లో కొత్త ప్రశ్నలు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బీహార్…. దేశ రాజకీయ భవిష్యత్తును సైతం ప్రభావితం చెయ్యగలవని అన్నిపార్టీలూ నమ్మే రాష్ట్రం. బీహార్ (Bihar) లో ఎన్నికలంటే అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. రెండు దశల్లో నిర్వహించిన ఎన్నికలు విజయవంతంగా ముగిసాయి. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూడనవసరం లేకుండా, ఎన్డీయే కే తిరిగి పట్టం…అంటూ ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను విడుదల చేసాయి.
ఇక ఫలితాల వెల్లడి…తదుపరి సీఎం ఎవరు, నితీశేనా, లేక మరొకరా….ఇలా కొత్త ప్రశ్నలు హల్ చల్ చేస్తున్నాయి. మహా ఘఠ్ బంధన్ కు నిరాశ తప్పేలా లేదు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, ఇండియా కూటమి బీహార్ ఫలితాలను సమీక్షించుకుని, మరో ఎన్నికలకు సమాయుత్తం కావలసిందే.
కర్ణాటక కాంగ్రెస్‌పై బీహార్ ప్రభావం..?
ఇక మరో ముఖ్యమైన విషయమేమిటంటే, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక సమస్యను ఎదుర్కొంటోంది. సిఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల మధ్య అధికార మార్పిడి అనే అంతర్యుద్ధం. పైకి అలాంటివేం లేవంటూనే ఎవరిపావులు వారు కదుపుతూ, సీటు వదిలేది లేదని ఒకరూ, ఆశ వదులుకోలేనని మరొకరు, అంతిమంగా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఇద్దరూ వేర్వేరు సంకేతాలిస్తూ అధిష్టానాన్ని సైతం అయోమయానికి గురిచేస్తున్నారు.
సిద్ధరామయ్యను అధికారం నుండి తప్పించి, ఒప్పందం ప్రకారం డీకే కి పట్టం కట్టబెడితే జరిగే నష్టం అధిష్టానానికి తెలియనిది కాదు. అందుకే ఆ విషయాన్ని దాటవేస్తూ వస్తోంది.
అంత:కలహాలను ఏదోవిధంగా బుజ్జగించుకోవచ్చు కానీ, అసలు అధికారమే కోల్పోకుండా చూసుకోవడం అధిష్టానం ముందున్న ప్రధాన సమస్య. బీహార్ ఫలితాలు కర్ణాటకపై ప్రభావం చూపకుండా ఉండాలంటే డీకే-సిద్ధు మధ్య సయోధ్య కోసం గట్టిగా ప్రయత్నిస్తూండడం, వీరిద్దరి సారథ్యంలోనే కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్తామని, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటామని గట్టిగా ప్రజల్లో సంకేతాలివ్వడం. ఏదేమైనా బీహార్ ఫలితాల విశ్లేషణ, కర్ణాటకలో భవిష్యత్తు కాంగ్రెస్ ముందున్న సవాళ్ళు ఇప్పుడు.
