AP| సర్వైకల్ క్యాన్సర్ : అవగాహనే రక్షణ!

AP| సర్వైకల్ క్యాన్సర్ : అవగాహనే రక్షణ!

కర్నూలు మెడికల్ కాలేజీలో అవగాహన శిక్షణ కార్యక్రమం
డాక్టర్ సాహిత్య జయరాం కీలక సూచనలు


కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు (Kurnool) మెడికల్ కాలేజీ లెక్చరర్ గ్యాలరీలో బుధవారం సర్వైకల్‌ (గర్భాశయ ముఖ ద్వారం) క్యాన్సర్‌పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ సాహిత్య జయరాం మాట్లాడుతూ… మహిళల్లో సాధారణంగా కనిపించే సర్వైకల్ క్యాన్సర్ (Cervical cancer) ను తొలి దశలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చని తెలిపారు.

పొత్తికడుపు నొప్పి, నెలసరి మధ్య రక్తస్రావం, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ చరిత్ర ఉన్నవారు 40ఏళ్లు దాటకముందే సంవత్సరానికి ఒకసారి స్కానింగ్, పాప్‌ స్మియర్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

డాక్టర్ జయరాం (Dr. Jayaram) మాట్లాడుతూ… “సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తలు తప్పనిసరి. ముందస్తుగా టీకా వేయించుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు” అని అన్నారు. 20 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలని సలహా ఇచ్చారు. క్యాన్సర్‌ నివారణలో అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్సా పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్‌, డాక్టర్ భాస్కర్‌, స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ నికత్ నస్రీన్‌, దంత వైద్యులు డాక్టర్ హడస్సా, నవ్యతేజ‌, ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్ సుధాకర్‌, ఆర్‌కే‌ఎస్‌కే కన్సల్టెంట్ మల్లికార్జున‌, ఫైనాన్స్ కన్సల్టెంట్ అరుణ, సామాజిక ఆరోగ్య అధికారులు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. వైద్యులు మాట్లాడుతూ… ఇటువంటి అవగాహన కార్యక్రమాలు గ్రామీణ స్థాయికి చేరేలా విస్తరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply