ఆజాద్ కృషి స్ఫూర్తిదాయకం…

ఆజాద్ కృషి స్ఫూర్తిదాయకం…
చిత్తూరు, ఆంధ్రప్రభ : విద్యామేధావి, స్వాతంత్ర్య సమరయోధుడు ( Freedom Fighter ) దేశ తొలి విద్యామంత్రిగా గుర్తింపు పొందిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారి తుషార్ డూడి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ… మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Maulana Abul Kalam Azad) భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన వ్యక్తిత్వమన్నారు. ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదు, విద్య, సాహిత్యం, సామాజిక సమానత్వం రంగాల్లో విశేష కృషి చేసిన మహానుభావుడన్నారు. ఆయన ఆలోచనలు, త్యాగం, కృషి మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ మౌలానా ఆజాద్ ప్రతి భారతీయుడు విద్యావంతుడిగా మారాలని కలగన్న దూరదృష్టి కలిగిన నాయకుడు అన్నారు.
మన దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు. నేడు మనం పొందుతున్న విద్యా అవకాశాలు ఆయన చూపిన దిశలోనే ఫలితమని చెప్పాలన్నారు. పేదరికం, నిరక్షరాస్యత అనే అంధకారాన్ని తొలగించడానికి విద్యే ఆయుధమని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి యువత ఆజాద్ ఆలోచనల నుండి ప్రేరణ పొందాలని, సమాజ అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఎస్పీ అన్నారు.
ప్రతి పిల్లవాడు విద్యకు దూరం కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, గురువులు, ప్రభుత్వ వ్యవస్థ అందరూ కలసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బంది కేవలం చట్టాన్ని అమలు చేసే వారు మాత్రమే కాదు, సమాజానికి మార్గదర్శకులు కూడా. విద్య, క్రమశిక్షణ, నీతి వంటి విలువలను ప్రజల్లో నాటే బాధ్యత మన అందరిదన్నారు. మౌలానా ఆజాద్ సేవలను స్మరించడం అంటే ఆయన చూపిన మార్గంలో నడవడం అని ఎస్పీ తుషార్ డూడి(SP Tushar Dudi) అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ అధికారి ఆపరేషన్లు, పరిపాలన ఇంచార్జ్ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, అదనపు పోలీస్ అధికారి ఏ.ఆర్.ఆర్. శివానంద కిషోర్, ఏ.ఆర్. డి.ఎస్.పీలు చిన్నికృష్ణ, మహబూబ్ బాష, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు చంద్రశేఖర్, వీరేశ్, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
