చిత్తూరులో 56.76 కోట్లతో పరిశ్రమల ఆవిష్కరణ

చిత్తూరులో 56.76 కోట్లతో పరిశ్రమల ఆవిష్కరణ

వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జిల్లాలో 116 ఎకరాల భూమిలో నూతన పరిశ్రమల స్థాపన

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరో అడుగు ముందుకు వేశారు. 56.76 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో 116 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్న నూతన పరిశ్రమలను ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ – 2025 సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలోని పలు పారిశ్రామిక పార్కులను ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్తూరు రూరల్ మండలం, వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమలు – ఉపాధి కల్పన (Industries – Employment Generation) కేంద్రానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ అముద, చిత్తూరు రూరల్ మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు రూరల్ మండలం, వెంకటాపురంలో పరిశ్రమలు – ఉపాధి కల్పన పేరుతో ఏర్పాటైన నూతన పారిశ్రామిక కేంద్రాన్ని (New Industrial Center) ప్రారంభించారు. 68ఎకరాలలో రూ.14.30 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ పరీక్షల్లో రానున్నాయి. కుప్పం మండలం పందర్లపల్లిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయంకు పునాదిరాయి వేశారు. 5 ఎకరాల విస్తీర్ణంలో, రూ.15.66 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

పుంగనూరు మండలం, చడల్ల గ్రామంలో సూక్ష్మ పరిశ్రమల పార్కు పునాదిరాయి వేశారు. 21.80 ఎకరాలలో రూ.9.50 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మిస్తారు. నగరి మండలం, మంగాడు గ్రామంలో సూక్ష్మ పరిశ్రమల పార్కు పునాదిరాయి వేశారు. ఇక్కడ 20 ఎకరాలలో , రూ.17.30 కోట్ల రూపాయల బడ్జెట్ తో పరిశ్రమను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాలతో కలిపి జిల్లాలో మొత్తం రూ. 56.76 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపన జరుగుతోంది. దీని వల్ల వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు (Daggumalla Prasada Rao) మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. చిత్తూరు రూరల్ మండలంలో పరిశ్రమల వాతావరణం సృష్టించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పరిశ్రమల విస్తరణతో చిత్తూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumit Kumar) మాట్లాడుతూ.. ప్రతీ మండలానికి పరిశ్రమల ప్రోత్సాహక వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనకు ఇది గొప్ప అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్‌పర్సన్ హేమలత, శాప్ చైర్మన్ రవి నాయుడు, టిడిపి నాయకులు కోదండ యాదవ్, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply