గ్రహణం వీడేదెన్నడు..?

మందు బాబులకు అడ్డాగా…
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్(Praja Parishad Complex) లకు గ్రహణం పట్టింది. ఈ గ్రహణం వీడేది ఎన్నడని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన కాంప్లెక్స్ లు వాటి ఆలనా, పాలనలకు కరువవడంతో నిరుపయోగంగా ఉండడం వల్ల చెత్తా, చెదారం చేరి చీమల పుట్టలు తయారై శిథిలావస్థకు చేరుతున్నాయి.
ప్రజల అవసరాల కోసం నిర్మించిన కాంప్లెక్స్ లు వృథాగా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాంప్లెక్స్ లు అధికారులకు, సిబ్బంది వాహనాల పార్కింగ్‌ల(Vehicle Parking)కే పరిమితమైంది. ఆర్భాటంగా నిర్మించిన భవనాలు నేటికీ వినియోగంలోకి రాలేదు. లక్షలు పోసి నిర్మించిన కాంప్లెక్స్ లు ఖాళీగా దర్శనమిస్తూ.. పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వినియోగంలోకి తీసుకురాకుండా భవనాలు నిర్మిస్తే మాత్రం ఏం లాభమని… ప్రజలు పెదవి విరుస్తున్నారు. పూర్తయిన భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు, మందు బాబులకు అడ్డాగా మారుతున్నాయి. ఎస్ఎఫ్ సి(SFC) నిధులు 2021- 22 సంవత్సరంలో రూ.15 లక్షల వ్యయంతో ఫిబ్రవరి 22, 2023 సంవత్సరంలో అప్పటి రోడ్డు భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ప్రారంభించారు.
అప్పుడు నిర్మించిన కాంప్లెక్స్ 4 షెటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. లక్షలు పోసి నిర్మించిన కాంప్లెక్స్ లు ప్రస్తుతం తాళలు వేసిన దృశ్యం దర్శనమిస్తోంది. నిరుపయోగంగా ఉండటం వల్ల నెలకు వేల రూపాయల ఆదాయం మండల పరిషత్ కోల్పోతున్నది. ఇప్పటికైనా కాంప్లెక్స్ షెటర్లను వినియోగంలోకి తేవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

