అవగాహన ర్యాలీ

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జాతీయ కేన్సర్ అగాహన దినోత్సవం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : కేన్సర్ పై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలని, మొదటి దశలోనే దాని లక్షణాలను గుర్తిస్తే వ్యాధిని జయించవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి కే.అనిత అన్నారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ పరిపాలన విభాగంలో జాతీయ కేన్సర్ అగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా వైద్యశాఖ అధికారి కే.అనిత, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ,
దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులదని, తరవాత స్థానం కేన్సర్‌దేనన్నారు. కేన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోందని, అందువల్ల బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని, దీనిపై సరైన అవగాహన లేక కేన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అవగాహన లేక పోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే కేన్సర్ నిర్ధారణ ఆలస్యమవుతోందని తెలిపారు. అలాగే పొగాకు, మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్లు ద్వారా కేన్సర్ వచ్చే అవకాశాలు మెండని, మన దేశంలో క్యాన్సర్ కారకాలలో 70 శాతం నివారించదగినవేనన్నారు. 40శాతం పొగాకుకు సంబంధించినవి, 20శాతం ఇతర వ్యాధుల వల్ల కలిగేవి, 10శాతం ఇతర కారణాల వల్ల సంభవించే కేన్సర్లన్నాయి.
రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు మాట్లాడుతూ, అనారోగ్యకర ఆహారపు అలవాట్లను ప్రతీ ఒక్కరు మార్చుకోవాలని, అధిక కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా సాల్టెడ్ ఫుడ్స్ తినడం, తక్కువ పండ్లు, కూరగాయలు తినే అలవాట్ల వల్ల అనేక రకాల కేన్సర్లు చుట్టుముట్టే ముప్పు ఉందని, పొగాకు తాగడం , నమలడం, నషం పీల్చడం పూర్తిగా మానేయాలని, ఆ వ్యసనం నుంచి బయట పడటానికి అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవాలన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, శారీరకంగా చురుకుగా ఉండటంతో పెద్దపేగు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ల ముప్పులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ మెంబెర్ కళ్యాణ్, చిన్మయ రావు, ఏవో నర్సింగ రావు, జిల్లా రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ జి.రమణ, కే. సత్యనారాయణ, బి.సతీష్, గుణాకర్, ఉమాశంకర్, ప్రతినిధులు హర్ష, సుజాత, జగదీష్ సంతోషి, జిల్లా వైద్యశాఖ అధికార కార్యాలయం సిబ్బంది పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
