నవీన్ యాదవ్‌కు మద్దతుగా…

- కోట నీలిమ విస్తృత ప్రచారం
సనత్ నగర్ / ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్‌మెంట్ వాసులతో మమేకమయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి పనులపై వివరాలు ఇచ్చారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని విమర్శించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మ్యానిఫెస్టోలోని ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వివరించారు.
ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆమె కోరారు. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో కోట నీలిమ వెంట సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
